21-02-2025 01:29:37 AM
*వ్యవస్థలు చట్ట ప్రకారం నడచుకోవాల్సిందే..
* హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ‘ఎందుకంత తొందర ? రాత్రికి రాత్రే సంస్కరణలు తీసుకురాలేం. హైడ్రా అయినా.. ఏ వ్యవస్థ అయినా.. చట్ట ప్రకారం చేయాలే తప్ప.. ఇష్టారీతిన చేస్తామంటే కుదరదు. అక్రమ కట్టడాల కూల్చివేతకు కోర్టు వ్యతిరేకం కాదు. కానీ, చట్టప్రకారం నడచుకోవాలి’ అంటూ హైడ్రాపై హైకోర్టు తీవ్రస్థాయిలో మందలించింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి సర్వే నంబర్ 296/ఇ/2 పరిధిలో మూడు గుంటల భూమిలోని షెడ్‌ను ముందస్తు సమాచారం లేకుండా (ఆదివారం) కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఇప్పటికే న్యాయస్థానం హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి గురువారం జస్టిస్ కె.లక్ష్మణ్ మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ‘ షెడ్డుకు సంబంధించి పిటిషనర్ తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను యంత్రాంగానికి సమర్పించారు. అయినప్పటికీ హైడ్రా అధికారులు ఎలాంటి సమాచారం లేకుండానే కూల్చివేశారు. ‘గాయత్రి’ సంఘం ఫిర్యాదు లోపభూయిష్టంగా ఉంది. ఫిర్యాదులో అసలు సర్వే నంబరే లేదు.
లేఅవుట్ పరిధిలో లోటుపాట్లను కప్పిపుచ్చుకునేందుకు సంఘం ప్రవీణ్ భూమిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నది’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ రవీంద్రరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఇకపై హైడ్రా సెలవు రోజు కూల్చివేతలు చేపట్టదు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘న్యాయస్థానం ఆదేశాలను లెక్కచేయకుండా ఉన్నా, చట్టాన్ని పాటించకుండా ఉన్నా, ఇకపై ఉపేక్షించం.
హైడ్రాను ఏర్పాటుకు సంబంధించిన జీవో 99ను రద్దు చేస్తాం’ అని హెచ్చరించారు. అనంతరం న్యాయమూర్తి ప్రతివాదులకు వ్యక్తిగత నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేశారు. కాగా, గత ఆదేశాల మేరకు హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ న్యాయస్థానం ముందు హాజరయ్యారు.