ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణ వాది మసౌద్ షెజెష్కియాన్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి పిడివాది సయీద్ జలీలిని ఆయన ఓడించారు. లెక్కించిన మొత్తం 3 కోట్ల ఓట్లలో డాక్టర్ షెజెష్కియాన్‌కు 1.6 కోట్లకు పైగా ఓట్లు (53.3 శాతం) రాగా, జలీలికి 1.3 కోట్లకు పైగా ఓట్లు (44.3 శాతం) వచ్చాయి. దీంతో షెజెష్కియాన్ గెలిచినట్లు అధికారులు శనివారం ధ్రువీకరించారు. ఈ మేరకు ఎన్నికల విభాగం అధికార ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. మే నెలలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. అయితే జూన్ 28న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో కేవలం 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడంతో ఆ రౌండ్‌లో ఏ అభ్యర్థికి మెజారిటీ రాలేదు.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం పోలయిన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థే విజయం సాధిస్తారు. దీంతో రెండో విడత ఎన్నికలు (రన్ ఆఫ్ పోలింగ్) నిర్వహించారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇలా రన్ ఆఫ్ పోలింగ్ జరగడం 2005 తర్వాత ఇదే మొదటిసారి. తొలి దశలో తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయుతుల్లా అలీ ఖమేనీ కూడా స్పందించారు. ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో మొత్తం 6.1 కోట్ల ఓటర్లలో దాదాపు 50 శాతం పోలింగ్ నమోదయింది.
గాజా యుద్ధంతో ఘర్షణలు, అణ్వాయుధ కార్యక్రమంపై పశ్చిమ దేశాలతో విభేదాలు, దేశీయంగా తీవ్రమైన అసంతృప్తి నెలకొన్న తరుణంలో ఈ ఎన్నికలు జరిగాయి. సంస్కరణ వాదిగా పేరున్న మసౌద్ హృద్రోగ నిపుణుడు. ఇరాన్‌ను ఆంక్షల చట్రంనుంచి బయటికి తీసుకు రావడానికి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తానని తన ప్రచారంలో ఆయన ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వానికి మాజీ అధ్యక్షులు హసన్ రౌహానీ, మహమ్మ ద్ ఖటామీ మద్దతు కూడా ఉండడం ఆయన విజయానికి కారణమయ్యా యి. అధ్యక్షుడిగా ఎన్నికయిన అనంతరం షెజిష్కియాన్ ఇరాన్ అధికారిక టెలివిజన్‌లో మాట్లాడుతూ దేశ ప్రజల అభిమానం, ప్రేమే తనను అధ్యక్షుడ్ని చేశాయన్నారు. ‘అందరికీ స్నేహహస్తం అందిస్తాం.. మనమందరం ఈ దేశ ప్రజలం. దేశ ప్రగతికి అందరమూ ఉపయోగపడాలి’ అని ప్రకటించారు. షెజెష్కియాన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై రాజధాని టెహరా న్ సహా ఇరాన్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం, మోరల్ పోలీసింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేశ ప్రజలు ప్రభుత్వం పట్ల ఆగ్రహాన్ని తక్కు వ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా తెలియజేశారని విశ్లేషకులు అంటున్నారు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయిన షెజెష్కియాన్ మోరల్ పోలీసింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2022లో ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధంగా హిజాబ్ ధరించలేదన్న కారణంగా అరెస్టు చేసిన మాషా అమేనీ అనే యువతి పోలీసు కస్టడీలో ఉండగానే మృతి చెందింది. ఈ ఘటన మొత్తం ఇరాన్‌ను కుదిపేసింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్ను ముట్టాయి.
వేల సంఖ్యలో యువత వీధుల్లోకి వచ్చి మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా గొంతెత్తింది. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. కాగా తాజాగా గాజా యుద్ధంలో హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా నిలవడంతో ఇటు ఇజ్రాయెల్‌తో పాటుగా అటు అగ్రరాజ్యం అమెరికాతో శత్రుత్వాన్ని కొని తెచ్చు కోవడంతో అంతర్జాతీయంగా ఇరాన్ దాదాపు ఒంటరయింది. మతతత్వ పాలనతో విసిగి పోయి ఉన్న ఇరాన్ యువత ఎంపీగానే కాకుండా గతంలో ఖతామీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన షెజెష్కియాన్ వైపు మొగ్గు చూపిందని అర్థ మవుతున్న వారి ఆశలను ఆయన ఏమేరకు నెరవేరుస్తారో చూడాలి.