హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల వారిగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుండి అభ్యర్థులను స్వీకరించేందుకు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ నేతృత్వంలోని సభ్యుల బృందం నవంబర్ 23న హైదరాబాద్ కలెక్టరేట్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ముకుంద రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో ఆ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.... ఈ నెల 23న హైదరాబాద్ కలెక్టరేట్ లో బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ ఉన్నందున అదిశగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీసీల అభ్యున్నతి, జీవన స్థితిగతులు, ప్రయోజనాలపై సూచనలు, అభ్యంతరాలు స్వీకరణ కార్యక్రమంలో కులసంఘాల నుండి దరఖాస్తులు స్వీకారణలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. అదే విదంగా ఆర్డీఓలు, తహసీల్దార్లు కూడా తమ తమ పరిధిలో ముందస్తుగా ప్రెస్ మీట్స్ నిర్వహించాలన్నారు.