calender_icon.png 1 March, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ కోర్సుల్లో సీట్ల తగ్గింపు!

01-03-2025 12:41:10 AM

  1. ఏటా 4 లక్షల సీట్లలో నిండుతున్నవి సగమే
  2. అవసరానికి మించి ఉన్న సీట్లకు కోతపెట్టే యోచనలో సర్కారు

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో డిగ్రీ ఉన్నత విద్యలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఏ కోర్సుల్లోనైనా సీట్లు తక్కువగా, చేరే వారి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉం టుంది. ఆ రకంగా డిమాండ్ ఉంటేనే మంచిది కూడా. కానీ డిగ్రీలో చేరే విద్యార్థుల కంటే ఉన్న అందుబాటులో ఉండే సీట్లే ఎక్కువ. ఈ పరిస్థితి కొన్నేండ్లుగా ఉంది.

కళాశాలలు కోరిందే ఆల స్యమన్నట్లుగా సీట్లను ఇష్టానుసారంగా పెంచేశారు. ఈ క్రమంలోనే సీట్లు ఎక్కువ.. వాటిలో చేరుతున్న విద్యార్థు లు తక్కువగా ఉంటున్నారు. అయితే దీనిపై దృష్టిసారించిన సర్కారు అవసరానికి మించి ఉన్న సీట్లను తగ్గించే యోచనలో ఉంది.

ఇందుకు కళాశాలలతో తెలంగాణ ఉన్నత విద్యామండలి సంప్రదింపులు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎన్ని సీట్లు అవ సరమో.. లెక్కలు వేసి, వాటినే భర్తీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌కు ముందే అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ప్రస్తుత 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, రెసి డెన్షియల్ కాలేజీలన్ని కలుపుకుంటే మొత్తం 1055 ఉన్నాయి. వీటిలో 4,57,704 సీట్లు అందుబాటులో ఉంటే, వాటిలో 2024-25 ఏడాదిలో 1,96,442 సీట్లు మాత్రమే నిండాయి. డిగ్రీ ఫస్టియర్‌లో ఇంకా 2,61,262 సీట్లు మిగిలాయి. అంటే మొత్తం సీట్లల్లో కేవలం 42 శాతం సీట్లు మాత్రమే భర్తీఅయ్యాయి.

2016-17 నుంచి దోస్త్ ద్వారా డిగ్రీ ఫస్టియర్‌లోని సీట్లను భర్తీచేస్తున్న విషయం తెలిసిందే. ఏ కోర్సుకు లేనంతగా డిగ్రీ అడ్మిషన్లను ఐదారు దఫాలుగా చేపడుతున్నా అవి సగం కూడా నిండడంలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో తొలుత మూడు విడుతల్లో సీట్లను భర్తీచేయగా, ఆ తర్వాత మళ్లీ రెండుమూడు విడుతల్లో సీట్ల భర్తీకి అవకాశమిచ్చారు.

ఇంజినీరింగ్‌లో చేరనివారు, సీట్లు రానివారికోసం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా డిగ్రీలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నారు. అయినా సీట్లు మాత్రం ఫుల్‌గా నిండడంలేదు. 2024-25లో మొత్తం డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అడ్మిషన్లు కనీసం 2 లక్షలు కూడా దాటలేదు. 

వచ్చే విద్యాసంవత్సరంలో తగ్గనున్న సీట్లు..

విద్యార్థులు పేరున్న కాలేజీల్లోనే చేరేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో ముందుగా ఆ కాలేజీల్లోని సీట్లు నిండుతున్నాయి. చిన్నా చితక కాలేజీల్లో సీట్లు భారీ స్థాయిలో మిగిలిపోతున్నాయి. రాష్ర్టంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సగం సీట్లు కూడా నిండడంలేదు.

రాష్ర్టంలో 816 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుండగా, వీటిల్లో 3,44,793 సీట్లుకు 38.39 శాతం సీట్లు మాత్రమే ఈసారి భర్తీ అయ్యాయి. గురుకుల డిగ్రీ కాలేజీల్లోని సీట్లకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 89వేల సీట్లకు 61 శాతం (55,361) సీట్లు 2024 విద్యా సంవత్సరంలో భర్తీ అయ్యాయి.

ఇంటర్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర టెక్నికల్ కోర్సుల వైపు వెళ్లిపోతున్నారు. ఇంటర్ సెకండియర్‌లో ఈసారి 5,02,280 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరైతే అందులో 3,22,432 మంది విద్యార్థులు పాస్‌కాగా, ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ రాసి మరో 60,615 మంది ఉత్తీర్ణత సాధించారు.

అంటే ఈ సంవత్సరం ఇంటర్ పాసైన వారు 3,83,047 మంది విద్యార్థులు మాత్రమే. అయితే వీరిలో దాదాపు 2 లక్షలలోపు మంది విద్యార్థులు మాత్రమే డిగ్రీలో జాయిన్ అవుతున్నారు. మిగిలిన వారు ఇంజనీరింగ్, ఇతర కోర్సులవైపు మొగ్గు చూపుడం, మధ్యలోనే చదువు మానేయడం జరుగుతోంది.

ఇలా సీట్లు భారీగా మిగిలిపోతుండటంతో రాష్ట్రంలో ఉన్నత విద్యలో వెనుకబడిపోతున్నామనే సంకేతాలు వెళ్తున్నాయి. ఈక్రమంలోనే ఈసారి సీట్లను తగ్గించే పనిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.