calender_icon.png 14 November, 2024 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కి కుదింపు

06-11-2024 12:00:00 AM

4వ దశ ప్రక్రియను ప్రారంభించిన ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ల (ఆర్‌ఆర్‌బీలు) సంఖ్యను విలీనాల ద్వారా తగ్గించే నాల్గవ దశ పక్రియను కేంద్ర ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతం దేశంలో 43 ఆర్‌ఆర్‌బీలు ఉండగా, వీటి సంఖ్య 28కి తగ్గుతుంది.

ఆర్థిక శాఖ రూపొందించిన రోడ్‌మ్యాప్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 15 ఆర్‌ఆర్‌బీలను ఆయా స్పాన్సర్డ్ బ్యాంక్‌లతో విలీనం చేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా 4 ఆర్‌ఆర్‌బీలు ఉండగా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 3 చొప్పున, బిహార్, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్‌ల్లో రెండేసి చొప్పున ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు ఉన్నాయి. 

ఆస్తులు, అప్పుల విభజన తర్వాతే తెలంగాణ ఆర్‌ఆర్‌బీల విలీనం

ఆర్థిక శాఖ రోడ్‌మ్యాప్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ల ఆస్తులు, అప్పుల విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌ఆర్‌బీల విలీనం జరుగుతుంది. ఆర్‌ఆర్‌బీల నిర్వహణా సామర్థ్యం మెరుగుపర్చడానికి, వ్యయాలను అదుపు చేయడానికి నాబార్డ్‌తో సంప్రదించి ఆర్‌ఆర్‌బీల సంఖ్యను 43 నుంచి 28కి తగ్గించడానికి రోడ్‌మ్యాప్ రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ తెలిపింది.

ఈ రోడ్‌మ్యాప్‌పై నవంబర్ 20కల్లా అభిప్రాయాలను తెలియపర్చాలంటూ ఆర్‌ఆర్‌బీల స్పాన్సర్డ్ బ్యాంక్‌ల చీఫ్‌లను కోరింది. ఆర్‌ఆర్‌బీలను తగ్గించే ప్రక్రియను కేంద్రం 20004-05 నుంచి ప్రారంభించింది. దీనితో అప్పుడు ఆర్‌ఆర్‌బీలు 196 ఉండగా, 2021కల్లా 43కు తగ్గాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీల్లో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, సంబంధిత స్పాన్సర్డ్ బ్యాంక్‌లకు 35 శాతం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం చొప్పున వాటా ఉన్నది.