calender_icon.png 6 November, 2024 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన పోలింగ్ శాతం

15-05-2024 01:49:28 AM

పాతబస్తీలో ఓటు వేయడానికి ఆసక్తి చూపని ఓటర్లు

చార్మినార్, మే 14 : పాతబస్తీ ఓటర్ల నాడీ రాజకీయ విశ్లేషకులకు అంతుచిక్కడం లేదు. ఏ ఎన్నికలు వచ్చిన పోలింగ్ శాతం మాత్రం తగ్గుతూ వస్తుంది. పోలింగ్ డే అంటే కొంతమంది ఓటర్లు హాలీడే అనుకుంటున్నారు. దీంతో నెల రోజుల ముందు నుంచే ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వ అధికారులు చేసిన కృషి ఫలించడం లేదు. ఇంటి చుట్టుపక్కల ఉన్న పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలనే ఆసక్తి చూపలేదు. సార్వత్రిక ఎన్నికలను అధికారులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ అనుకున్నంతా పోలింగ్‌శాతం పెంచలేకపోయారు.  

ఓటర్లు పెరిగినా ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తుంది

పాతబస్తీలో చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో 2014 నుంచి 2024 వరకు గణనీయంగా ఓటర్ల శాతం పెరుగుతూ వస్తుంది. ఓటర్లు పెరిగిన శాతానికి అనుగుణంగా పోలింగ్ శాతం నమోదు కావడం లేదు. ఇదే రాజకీయ నాయకుల్లో చర్చకు దారి తీస్తుంది. ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఓటుపై అధికారులు అవగాహన కల్పించినా.. రాజకీయ పార్టీలు ఆకట్టుకునేలా ప్రచారం చేసిన కొంతమంది ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిల్చుని ఓటు వేయడానికి ఇష్టపడటం లేదు.

పాతబస్తీలో గతంలో 60, 65శాతం కూడా పోలింగైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఓటింగ్‌శాతం తగ్గుతూ వస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 45శాతం నుంచి 55శాతం వరకు కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ నమోదు అయితే యాకుత్‌పురాలో మధ్యాహ్నం ౩ గంటల వరకు కూడా 20శాతం పోలింగ్ నమోదు కాకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. చివరి ఓటు వరకు కేవలం 31శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో ఎంబీటీ అభ్యర్థిపై మజ్లిస్ అభ్యర్థి కేవలం 810 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఓటర్ల తీరు మారకపోతే భవిష్యత్‌లో కష్టమేనని పాతబస్తీ ప్రజలు చర్చించుకుంటున్నారు.

పాతబస్తీలో ఓటు వేయడానికి ముఖం చాటేసిన ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ మజ్లిస్ అభ్యర్థిగా పోటీచేసిన అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ౪సార్లు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థిగా మాధవీలత బరిలో నిలవడంతో ఇద్దరి మధ్య పోటీ టఫ్‌గా మారింది. నువ్వా.. నేనా అనే స్థాయిలో ప్రచారంతో అందరి దృష్టి పాతబస్తీపై పడింది. అయితే గంటగంటకు అభ్యర్థులో గుబులు మొదలైంది. అనుకున్న స్థాయిలో పోలింగ్ జరుగకపోవడంతో మధ్యాహ్నం పాతబస్తీలో మజ్లిస్ శ్రేణులతో పాటు కొందరు మతపెద్దలు ఇంటింటికీ వెళ్లి తలుపులు కొట్టి ఓటు వేయండని కోరారు.

యాకుత్‌ఫురా ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లాఖాన్‌తో పాటు మరి కొందరు తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం చూస్తే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ముస్లిం ఓటర్లతో పాటు హిందువులు నివసించే ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. పాతబస్తీ ఓటర్లు ఎప్పుడు మారుతారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులతో పాటు మేధావులు చర్చించుకుంటున్నారు. తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంటుందోననే చర్చ జోరుగా సాగుతుంది.