calender_icon.png 25 October, 2024 | 11:59 AM

తగ్గిన పన్ను వసూళ్లు

08-08-2024 12:46:50 AM

వాణిజ్య పన్నుల శాఖలో అవకతవకలే కారణమా? 

2021-22లో రూ.64,778 కోట్లు వసూలు

2022 రూ.12 వేల కోట్లు పెరుగుదల 

202౩-24లో మైనస్ రూ.184 కోట్లు వసూలు 

ఇంకా రిటర్న్ ఫైలింగ్ చేయని 19 వేల కంపెనీలు 

ఆదాయం కోసం ప్రభుత్వ ఆశలన్నీ ఈ శాఖపైనే..

కే నవీన్

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన విభాగాల్లో వాణిజ్య పన్నుల శాఖ అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రానికి వచ్చే సొంత ట్యాక్స్ రెవెన్యూలో 63 శాతం వాటా ఈ శాఖ నుంచే వస్తుంది. అంతటి ముఖ్యమైన శాఖలో ఏటా పెరుగుతున్న పన్ను వసూళ్లు.. 2023 ఆర్థిక సంవత్సరంలో 2022 కంటే తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోంది.

జీఎస్టీ 2017 నుంచి మొదలవ్వగా, అప్పటి నుంచి ఏటా రూ.5 వేల కోట్ల వరకు పెరుగుతూ వస్తున్న పన్ను వసూళ్లు 2022 ఏకంగా రూ.12 వేల కోట్లు అధికమయ్యాయి. 2023 పన్నుల రాబడి మైనస్ రూ.184 కోట్లు కావడం గమనార్హం. ఇప్పటికే రూ.1400 కోట్ల జీఎస్టీ స్కామ్ సహా, వాణిజ్య పన్నుల శాఖ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేపథ్యంలో.. ట్యాక్స్ రాబడి భారీగా తగ్గడం చర్చనీయాశంగా మారింది. అవకతవలు జరిగాయా? లేకుంటే ఇది స్కామ్ పుణ్యమా? లేకుంటే ఇందులో మరో కోణం ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.85,122 కోట్లు లక్ష్యం

వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోకి జీఎస్టీ, వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వస్తాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు ప్రభుత్వం రూ.85,122 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. ఇది గతేడాది కంటే దాదాపు 18 శాతం ఎక్కువ. ఈ ఏడాది 100 శాతం రాబడిని సాధించే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం లక్ష్యం రూ.20,950 కోట్లు నిర్దేశించగా.. రూ.19 వేల కోట్లు వసూలయ్యాయి. ఇది నిర్దేశించిన లక్ష్యంలో 91శాతం.

అనుమానాలు ఎన్నో.. 

వాణిజ్య పన్నుల శాఖలో ఇప్పటికే పలు అక్రమాలు వెలుగు చూశాయి. రూ.1400 కోట్ల జీఎస్టీ స్కామ్ జరిగినట్టు ఇటీవల కేసు నమోదైంది.  మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ నిందితుడిగా ఉండటం సంచలనంగా మా రింది. ఐదేళ్లలో జరిగిన అవకతవల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.986 కోట్లు నష్టం వాటిల్లినట్టు కాగ్ నివేదికలో వెల్లడించింది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో జీఎస్టీ వసూళ్లో అవకతవకలు జరిగినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో చిన్న, చితక కలిపి మొత్తం 19 వేల కంపెనీలు ఇప్పటివరకు రిటర్నులు ఫైల్ చేయలేదని అధికారులు చెప్తున్నారు. అయితే బయటకు రాని అక్రమాల వల్లే పన్ను వసూళ్లు తగ్గాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

వాస్తవ బడ్జెట్ తర్వాత మారే అవకాశం!

ప్రభుత్వ వివరాల ప్రకారం మైనస్ రూ.184 కోట్లు వసూలైనట్టు కనపడుతోందని, అయితే ఇవి ముందస్తు మదిం పు చేసిన వసూళ్లని, వాస్తవ బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత ఈ అంకెలు మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నా రు. ఈ క్రమంలో 4శాతం వరకు పెరగొచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ౪ శాతం పెరిగినా గతేడాది కంటే రూ.3 వేల కోట్ల వరకు ఎక్కువ వసూలయ్యే అవకాశం ఉంటుంది. కానీ, 2021 2022 మధ్య పెరిగిన రాబడి కంటే.. దాదాపు రూ.8 వేల నుంచి 9వేల కోట్ల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.