calender_icon.png 19 January, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన ధర.. పెరిగిన డిమాండ్

27-07-2024 12:54:04 AM

న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్ తర్వాత స్థానిక మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5 వేల మేర దిగొచ్చింది.కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో నగల దుకాణాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మరికొన్ని రోజుల్లో పండగల సీజన్ ప్రారంభం కానున్నవేళ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు జనం పోటీపడుతున్నారు. బంగారం ధర భారీగా తగ్గిన నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. పసిడి అక్రమ రవాణాను అరికట్టేందుకు సుంకం తగ్గించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో సుంకాన్ని తగ్గించడంతో  కిలోకు సుమారు రూ.3.90 లక్షల వరకు ధర తగ్గడం గమనార్హం. బడ్జెట్ తర్వాత         10 గ్రాముల బంగారం మీద రూ.5 వేలు మేర తగ్గింది. అటు వెండి కిలోకు రూ.7 వేల వరకు తగ్గి ప్రస్తుతం రూ.84 వేలు పలుకుతోంది.

కొనుగోళ్ల ఉత్సాహం

కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు తర్వాత ఆభరణాల కొనుగోలుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీపావళి, ధన్‌తేరస్ వంటి         పండగలు, వివాహాది శుభకార్యాలు ముందుండడంతో ఆభరణాల కొనుగోలుకు డిమాండ్ పెరిగినట్లు వర్తకులు చెబు తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే సుమారు 20 శాతం మేర డిమాండ్ పెరిగినట్లు పేర్కొంటున్నారు. నగల గురించి ఆరా తీసే వారి సంఖ్య కూడా పెరిగిందంటున్నారు. దీంతో కొన్ని సంస్థలు ఆభర ణాల తయారీదారుల సెలవులు కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో బంగారం కొనాలనుకుంటున్నవారంతా ఇప్పుడు తమ కలను సాకారం చేసుకుంటున్నారని వర్తకులు చెబుతున్నారు. అయితే, ఒకేసారి డిమాండ్ పెరిగితే ప్రభుత్వం ఎక్కడ మళ్లీ సుంకాన్ని పెంచుతుందోనన్న భయాలూ కొందరు వర్తకుల్లో నెలకొనడం గమనార్హం.

మరోవైపు ధర తగ్గడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.  అయితే  బంగారం ధరలో స్థిరత్వం అనేది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, వివిధ దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటు ందని చెబుతున్నారు.