calender_icon.png 25 December, 2024 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైలో తగ్గిన కాంగ్రెస్ ప్రాభవం

03-11-2024 02:13:07 AM

నగర పరిధిలో 11 స్థానాలకే పరిమితం

2019లో 30 స్థానాల్లో పోటీ చేసిన హస్తం పార్టీ

15 స్థానాల్లో పోటీకి సిద్ధమైనా వీలుపడలేదన్న నేతలు

రూ.24కోట్ల విలువైన నగలు, వజ్రాలు సీజ్

ముంబై, నవంబర్ 2 ముంబైలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ముంబైలో మొత్తం 36 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కాంగ్రె స్ కేవలం 11 స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది. 2019 ఎన్నికల్లో హస్తం పార్టీ ఇక్కడ 30 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ పొత్తులో భాగంగా ఇప్పుడు కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. వీటిలో నాలుగు కాంగ్రెస్ సిట్టింగ్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. బైకుల్లా, వెర్సోవా అసెంబ్లీ స్థానాల కోసం కాంగ్రెస్ నేతలు పట్టుపట్టినా ఫలితం లేకుండా పోయింది.

కాంగ్రెస్ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం ఇదే ప్రథమం. ముంబైలోని 14 స్థానాల్లో పోటీ చేయాలని భావించినా అది సాధ్యం కాలేదని ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎంపీ వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు. బైకుల్లా, వెర్సోవా సీట్లతోపాటు మరికొన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ శివసేన (యూబీటీ) అప్పటికే అభ్యర్థులను ప్రకటించడం, చర్చలు ఫలించకపోవ డం వల్ల తక్కువ స్థానాలు పొందినట్టు చెప్పా రు.

అయినా పొత్తు ధర్మంలో భాగంగా మహా వికాస్ అఘాడీ కూటమి విజయం కోసం పని చేయనున్నట్టు చెప్పారు. అయితే హస్తం పార్టీ  తక్కువ స్థానాలకు పరిమితం కావడం వల్ల భవిష్యత్తులో పార్టీ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో ముమ్మరంగా తనిఖీలు కొనసా గుతున్నాయి. అహల్యానగర్ జిల్లాలోని టోల్ ప్లాజా సమీపంలో అధికారులు వాహనాలను తనిఖీలు చేయగా ఓ కారులో సుమారు రూ.24కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి నగలను గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వాళ్లు చూపించిన రసీదులకు ఆభరణాల విలువ సరిపోకపోవడంతో వాటిని సీజ్ చేశారు. ఈ కేసును ఐటీ శాఖకు బదిలీ చేశారు. 

భారీగా పెరిగిన ఆస్తులు

మహారాష్ట్ర సీఎం ఎక్‌నాథ్ షిండేతో సహా 27 మంది క్యాబినెట్ మంత్రుల ఆస్తులు భారీగా పెరిగాయి. ఈ విషయం వాళ్లు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా వెల్లడైంది. గత ఐదేళ్లలో మంత్రుల నికర ఆస్తులు పెద్ద మొత్తంలో పెరగడానికి భూములు, ఫ్లాట్లు కొనుగోళ్లే కారణం కావడం గమనార్హం. మంత్రులు అఫిడవిట్లో సమర్పించిన వివరాల ప్రకారం మహారాష్ట్రలో మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రిగా పని చేసిన అదితీత్కరే నికర ఆస్తులు ఏకంగా 772శాతం పెరిగాయి. 2019 అఫిడవిట్ ప్రకారం ఆమెకు రూ.39లక్షల విలువైన ఆస్తులు ఉండగా ప్రస్తుతం వాటి విలువ రూ.3.4కోట్లకు చేరింది. సీఎం షిండే ఆస్తులు ఈ ఐదేళ్లలో 187శాతం పెరిగాయి. దీంతో ఆయన నికర ఆస్తుల విలువ రూ.5.9 కోట్ల నుంచి రూ.15.9 కోట్లకు చేరింది. పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ రవీంద్ర చౌహానన్ ఆస్తులు 117 శాతం పెరిగాయి. గతంలో ఆయన ఆస్తుల విలువ రూ.7కోట్లు అయితే ప్రస్తుతం ఆయనకు రూ.15.5కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.