13-02-2025 01:26:29 AM
జనవరిలో 4.31 శాతానికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార వస్తువుల ధరలు తగ్గిపోవడంతో 2024 డిసెంబర్ నెలతో పోలిస్తే 2025 జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతానికి పరిమితమైంది. గతేడాది డిసెంబర్ నెలలో 5.22 శాతంగా నమోదైంది. గ్రామీణ ద్రవ్యోల్బణం 5.76 (డిసెంబర్) నుంచి 4.64 శాతానికి, పట్టణ ద్రవ్యోల్బణం 4.58 శాతం (డిసెంబర్) నుంచి 3.87 శాతానికి పతనమైంది.
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మరోమారు ఆర్‌బీఐ తన రెపోరేట్ తగ్గింపునకు మార్గం సుగమం చేసింది. దాదాపు ఐదేండ్ల తర్వాత ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ తన రెపోరేట్ 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా వినియోగాన్ని పెంపొందించేందుకు ఆదాయం పన్ను శ్లాబ్‌లలో కోతలు విధిస్తూ ఈ నెల ఒకటో తేదీన బడ్జెట్‌లో ప్రకటించింది.
అంతకు ముందు అక్టోబర్‌ల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరుకుని 14 నెలల గరిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. 10.9 శాతంతో ఆహార ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి దూసుకెళ్లింది. డిసెంబర్ ఆహార ద్రవ్యోల్బణం 8.39 శాతం నుంచి 6.02 శాతానికి పతనమైంది.
గతేడాది ఆగస్టు తర్వాత ఇదే అత్యంత కనిష్టం. కూరగాయల ధరలు డిసెంబర్‌లో 26.6 శాతం ఉంటే, గత నెలలో 11.35 శాతానికి దిగి వచ్చాయి. తృణ ధాన్యాల ధరలు 6.50 నుంచి 6.24 శాతానికి, పప్పు దినుసుల ధరలు 3.80 శాతం నుంచి 2.59 శాతానికి పతనం అయ్యాయి.