calender_icon.png 25 November, 2024 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన సాగు.. పెరిగిన ధరలు

14-10-2024 12:50:54 AM

రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కూరగాయల సాగు తగ్గుముఖం

ప్రభుత్వ ప్రోత్సాహం లేక రైతుల్లో తగ్గిన ఆసక్తి

వ్యవసాయ భూములు వెంచర్లుగా మారడం మరో కారణం

రోజురోజుకూ రేట్లు పిరం 

రంగారెడ్డి, అక్టోబర్ ౧౩ (విజయక్రాంతి): కూరగాయలు, ద్రాక్షతోటలకు ఒకప్పుడు ప్రసిద్ధి రంగారెడ్డి జిల్లా. 20 ఏళ్ల క్రితం ఉమ్మ డి రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాలలో వ్యవసాయ భూముల్లో ఎటు చూసినా ఆకుకూరలు, కూరగాయల సాగు కనిపించేది.

జిల్లాలోని చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లోని రైతులకు మెజార్టీగా పండ్ల తోటలు, ఆకుకూరగాయల సాగే జీవనాధారం. రైతులు తాము సాగు చేసిన ఆకుకూరలు, కూరగాయలు హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్‌కు తరలించే వారు. కాలక్రమేణా రియల్ వ్యాపారం సిటీ శివారు ప్రాంతాలకు పాకింది.

రైతులు తమ అవసరాల నిమిత్తం పొలాలను అమ్మకాలకు పెట్టారు. సిటీలో జనాభా పెరగడంతో క్రమక్రమంగా శివారు ప్రాంతాలన్నీ వెంచర్లుగా మారాయి. దీంతో విలువైన సాగు భూములన్నీ ప్రస్తుతం రియల్ వెంచర్లు, విల్లాలకు నిలయాలుగా మారాయి.

దీంతో వేల ఎకరాలు సాగు భూములు కనుమరుగయ్యా యి. నగరానికి మెజార్టీ కూరగాయలు ఈ ప్రాంతం నుంచే వచ్చేవంటే అతిశయోక్తి కాదు. కానీ, ప్రస్తుతం జిల్లా కూరగాయల ఎగుమతి స్థాయి నుంచి అన్ని దిగుమతి చేసుకొనే దుస్థితికి దిగజారింది.

సాగుపై ఆసక్తి చూపని రైతులు.. 

సారవంతమైన పొలాలు, నీటి వసతి ఉన్నప్పటికీ రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ప్రతి వ్యవసాయ సీజన్‌లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగు చేపట్టగా, ప్రస్తుతం రెండు, మూడేళ్ల నుంచి సుమారు 15 వేల ఎకరాలకు పడిపోయింది.

ఎరువులు, విత్తనాలు, ఫెర్టిలైజర్ ధరలు పెరగడం, పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం రాకపోవడం, అకాల వర్షాలు, చీడపీడలు వ్యాపించడం వంటి కారణాలతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. పండించిన కూరగాయలు మార్కెట్లోకి వెళ్లి విక్రయిస్తే కనీసం రవాణా ఛార్జీలకు సరిపడా కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూరగాయలను మార్కెట్‌కు తరలిస్తే ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మార్కెట్లోనే పారబోస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంటల సాగుపై హార్టికల్చర్ అధికారులు అవగాహన కల్పించకపోవడం, ప్రభుత్వాలు సైతం ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ ఇవ్వకపోవడం, అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోకపోవడం.. ఇలా రకరకాల కారణాల వల్ల సాగుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదు.

మండిపోతున్న ధరలు.. 

ఇటీవల నిత్యం పెరుగుతున్న కూరగాయ ల ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దసరా పండుగ పూట నిత్యావసర సరకుల ధరలు ఒకవైపు మండిపోతుంటే.. మరోపక్క కూరగాయల రేట్లు వినియోగదారులకు చుక్కలు చూపిస్తుండగా.. పప్పు ధరలు మోతమోగుతున్నాయి.  

సాగుపై రియల్ ఎస్టేట్ ప్రభావం

యాదాద్రి భువనగిరి: హైదరాబాద్ అభివృద్ధి ప్రభావం సరిహద్దు జిల్లాల్లో ఉద్యానవన పంటల సాగుపై పడుతోంది.   యాదాద్రి భువనగిరి జిల్లాలో అయిదేళ్ల క్రితం దాదాపు 10 వేల ఎకరాల వరకు కూరగాయలు, ఆకుకూరల సాగు జరిగేది. అయితే, అది ప్రస్తుతం 1000 ఎకరాల కిందకు పడిపోయింది.

రైతులు కూరగాయలను తమ సమీపంలోని పట్టణాలతో పాటు హైదరాబాద్‌లోని బోయినపల్లి, గడ్డిఅన్నారం మార్కెట్లకు తరలించి విక్రయించు కునే వారు. సాగుకు ఉద్యానవన శాఖ విత్తనాలు, నారు మొదలు సాగు, తీగజాతుల కోసం పందిళ్లు, డ్రిప్ సదుపాయంతో పాటు రవాణాకు ట్రేలు, వ్యాన్లను సబ్సిడీపై అందించి  ప్రోత్సాహం అందించేది.

అయితే, 2017 నుంచి ప్రభుత్వం రాయితీలను పూర్తిగా నిలిపివేసింది. దీనికితోడు పెట్టుబడి వ్యయం పెరగడం, కూలీలు, రవాణా ఛార్జీలు రైతులకు భారంగా మారాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం 2023 వానకాలంలో 865 ఎకరాల్లో సాగు జరగగా, 2024 వానకాలంలో 756 ఎకరాల్లో సాగు చేపట్టినట్లు తెలుస్తోంది.

కాగా, నగర శివారు మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూరగాయల సాగు కు అనుకూలమైన భూములను సమీకరించి వెంచర్లు చేయడం కూడా సాగు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు.