* గతంతో పోలిస్తే 2.7 ఏండ్లు తగ్గుదల
* కొవిడ్ తర్వాత మారిన జీవన ప్రమాణాలు
న్యూయార్క్, డిసెంబర్ 30: ఆధునిక ప్రపంచంలో ప్రజాబాహుళ్యం ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం కొవిడ్. అయిదేండ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మహమ్మారితో ఇప్పటికీ జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా కొవిడ్ ప్రబలిన రెండేండ్ల కాలంలో అగ్రరాజ్యం అమెరికా ప్రజల సగటు ఆయుర్దాయం 2.7 సంవత్సరాలు తగ్గిందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది.
1939 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంత భారీ స్థాయిలో కొవిడ్ సమయంలోనే ఆయుర్దాయం తగ్గింది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు గుండె సంబంధిత వ్యాధులతో మరణించగా, కొవిడ్ తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఈ సంక్షోభ సమయంలోనే కొవిడ్ తర్వాత సార్స్ కోవ్ 2 వైరస్ ద్వారా రక్తం గడ్డకట్టి అనేకులు మృత్యువాతపడ్డారు.
పెరిగిన ఆల్కహాల్ వినియోగం, ఆరోగ్యసంరక్షణ చర్యలు పాటించకపోవడం వల్ల కాలేయ సంబంధ వ్యాధులు సంభవించాయి. కాగా సామాజిక దూరాన్ని పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సురక్షిత మాస్కులు ధరించడం వల్ల అత్యధికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.
కొవిడ్ వ్యాప్తి ప్రారంభమై నాలుగో ఏటికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్, రోగ నిరోధక రక్షణలు పెరగడంతో మరణాల రేటు తగ్గింది. అయినప్పటికీ కొవిడ్ బారిన పడిన అనేకుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.