calender_icon.png 30 September, 2024 | 1:58 PM

తగ్గిన అంగన్‌వాడీ!

30-09-2024 01:41:59 AM

మెదక్ జిల్లా ‘ఐసీడీఎస్’ను వేధిస్తున్న సిబ్బంది కొరత

సూపర్‌వైజర్, అంగన్‌టీచర్, ఆయాల పోస్టులు ఖాళీ

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అరకొర సేవలు

అదనపు బాధ్యతలతో అల్లాడుతున్న మిగిలిన సిబ్బంది

తక్షణం పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్

మెదక్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించడం, చిన్నారులు ప్రాథమిక విద్యకు వెళ్లే మునుపు ఆటపాటలతో కూడిన విద్య అందించే లక్ష్యంతో సుమారు రెండు దశాబ్దాల క్రితం ఐసీడీఎస్ వ్యవస్థ ఏర్పాటైంది.

ఆ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలూ అందు బాటులోకి వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం నాడు అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు కాగా, ఆ తర్వాత లెక్కలు జరగలేదు. ఆ తర్వాత జనాభా పెరిగినా అంగన్ వాడీ కేంద్రాలు మాత్రం పెరగలేదు. ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా టీచర్లు, ఆయా పోస్టులు పెరగక వారిపై పనిభారం పడుతోంది.

అంగన్‌వాడీ టీచర్లకు వారికి కేటాయించిన పనులు పూర్తి చేయడమే కాకుం డా, సర్కార్ వారిని ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ అధికారులు గా వినియోగిస్తున్నది. వైద్యారోగ్య శాఖ చేపట్టే ప్రతి సర్వేలో వీరినే బాధ్యులను చేస్తున్నది. దీంతో వారు ఇటు కేంద్రా లు సకమ్రంగా నిర్వహించలేకపోతున్నారు. ప్రస్తుతం ఐసీడీఎస్ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ కొరత లబ్ధిదారులకు సేవలు అం దించడంలోనూ ప్రభావం చూపిస్తున్నది.

అంతంతమాత్రంగా సేవలు..

సిబ్బంది కొరత కారణంగా కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అంగన్‌వాడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రస్తుతం ఆ సమీపంలోని మరో కేంద్రానికి బాధ్యులైన టీచర్ నడిపిస్తున్నారు. వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తుండగా, రెండు కేంద్రాల నిర్వహణ కష్టతరంగా మా రింది.

అంగన్‌వాడీ టీచర్లు తమ కేంద్రం పరిధిలోని చిన్నారుల ఎత్తు, బరువు కొలతలు తీసుకోవడం, పౌష్టికాహారం అందజేయడమే కాక, మరో కేంద్రంలో అవే బాధ్యతలు నిర్వహించడం తలకు మించిన భారంగా పరిణమిం చింది. ఇక ఆరోగ్య పరీక్షల సంగతైతే చెప్పనక్కర్లేదు. సర్కార్ సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా ప్రకటించింది. కానీ సిబ్బంది కొరత కారణంగా ఆ కార్యక్రమం పెద్దగా విజయవంతం కాలేదనే విమర్శలు ఉన్నాయి. 

జిల్లాలో ఖాళీలు ఇలా..

జిల్లా వ్యాప్తంగా 33 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 65 ఏళ్లు నిండిన టీచర్లు ఇటీవల రిటైర్మెంట్ తీసుకున్నారు. మరికొంత మంది కొన్నికారణాలతో విధులకు దూరమయ్యారు. అలాగే జిల్లా వ్యా ప్తంగా 283 ఆయా పోస్టులు ఖాళీగా  ఉన్నాయి. వీరిలో కూడా 65 ఏళ్లు నిండిన వారు రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల కాగానే వీరంతా విధుల నుంచి నిష్క్రమిస్తారు.

అలాగే జిల్లాలో ఐసీడీఎస్ 42 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ప్రస్తుతం 35 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇలా అన్నీ కలిపి 323 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదనపు బాధ్యతలతో అల్లాడుతున్నామని, తక్షణం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు కోరుతున్నారు.

ఖాళీలను భర్తీ చేస్తాం

జిల్లాలోని ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్, టీచర్, ఆయా పోస్టులకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ఉన్నతాధికాఉలకు నివేదించాం. 65 ఏళ్లు దాటిన టీచర్లు, ఆయాల రిటైర్మెంట్‌తో ఖాళీల సంఖ్య మరింత పెరుగు తోంది. త్వరలో భర్తీ చేసేందుకు చర్య లు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. నిర్దేశిత సమాయనికి వారికి పౌష్టికాహారం అందిస్తున్నాం.


 బ్రహ్మాజీ, 

జిల్లా సంక్షేమ శాఖ అధికారి, మెదక్