ముంబై, జూలై 5 : రికార్డుస్థాయి నుంచి దిగివచ్చి, గత సమీక్షావారంలో స్వల్పంగా పెరిగిన విదేశీ మారక నిల్వలు జూన్ 28తో ముగిసినవారంలో తిరిగి తగ్గాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫారిన్ ఎక్సేంజ్ రిజర్వులు 1.713 బిలియన్ డాలర్ల మేర తగ్గి 651.997 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ తొలివారంలో దేశం వద్ద ఫా రెక్స్ నిల్వలు 655.817 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి పెరిగాయి. తాజాగా జూన్ 28తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.252 మిలియన్ డాలర్లు తగ్గి 572.881 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. దేశం వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో 427 మిలియన్ డాలర్లు తగ్గి 56.528 బిలియన్ డాలర్ల స్థాయికి దిగాయి. ఎస్‌డీఆర్‌లు 35 మిలియన్ డాలర్లు క్షీణించి 18.014 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.