calender_icon.png 3 March, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్ కత్తి

27-02-2025 12:00:00 AM

వచ్చే ఏడాది పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనకు కేం ద్రం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది చేపట్టే జనగణన ప్రక్రియ ఆధారంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకముందే దక్షిణాది రాష్ట్రాల్లో దీనిపై పెద్దఎ త్తున ఆందోళన మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడుపై వేలాడుతున్న కత్తి అని, జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రంలో వాటి సంఖ్య ఇప్పుడున్న 39 సీట్లనుంచి 31 సీట్లకు తగ్గి పోతాయని రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

కుటుంబ నియంత్రణ విషయంలో విజయం సాధించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న కానుక ఇదా అని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలన్నిటితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా ఒక్క లోక్‌సభ స్థానం కూడా తగ్గదని స్పష్టం చేశారు. అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆందో ళన మాత్రం అలాగే ఉంది. ప్రతి రాష్ట్రానికీ దాని జనాభాను బట్టి నియోజ క వర్గాలను కేటాయించాలని 81వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. ప్రతి పదేళ్లకోసారి జరిగే జనగణన అనంతరం లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ వచ్చింది.

1970 దశకం నుంచి దేశ జనాభా పెరిగినా నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణే దీనికి కారణం. 1971జనగణన ప్రకారం నిర్దేశించిన లోక్‌సభ నియోజకవర్గాలే 2001వరకు కొనసాగుతాయని ఆ సవరణ పేర్కొంది. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా పాటించి జనాభా పెరుగుదలకు పగ్గాలు వేసిన దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభలో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని అప్పట్లోనే ఆందోళన చేశాయి. దాన్ని ఉపశ మింపజేయడానికే పునర్విభజనను 2001వరకు వాయిదా వేశారు.

అయి తే అప్పటికీ దక్షిణాది రాష్ట్రాలే కుటుంబ నియంత్రణలో ముందుండడం తో పునర్విభజనను 2026కు వాయిదా వేశారు. అసలు 2002 తర్వాత అసోం, జమ్మూ, కశ్మీర్, కేంద్రపాలిత ప్రాంతాలు మినహా ఎక్కడా నియో జకవర్గాల పుర్విభజన జరలేదు. దేశ జనాభాలో 1970 దశకం తర్వాత వచ్చిన మార్పులకు అనుగుణంగా లోక్‌సభ స్వరూపం మారలేదు. ఇది సమాఖ్య స్ఫూర్తితో పాటుగా‘ఒక పౌరుడుఒక ఓటుఒకే విలువ’ సూత్రంపైనా ప్రభావం చూపుతోంది. ఎందుకంటే చాలాకాలంగా ఉత్తర భారత జనాభా దక్షిణ భారతం కన్నా పెరుగుతూ వస్తోంది. 2011 జనగణ న ఆధారంగా రాష్ట్రాలకు సీట్లు కేటాయిస్తే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశాలు గణనీయంగా సీట్లు కోల్పోవచ్చు.

అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు ఆ మేరకు అదనంగా సీట్లు లభిస్తాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానా లుండగా అవి మరింతగా పెరుగుతాయి. ఫలితంగా దేశ రాజకీయాల్లో దాని ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం యూపీలో ఒక ఎంపీ సగటున 25 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుంటే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో 16 నుంచి 18 లక్షలకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి. లేదంటే మన ప్రజాస్వామ్యం పనితీరు దెబ్బతింటుంది. కుటుంబ నియం త్రణ విషయంలో ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలది వెనకంజే. ఇటుంటి పరిస్థి తుల్లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిపితే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. దీనికి పరిష్కా రంగా ఆ రాష్ట్రాలకు ప్రణాళికా సంఘం ఎక్కువ నిధులను కేటాయించడం, అలాగే పెద్ద రాష్ట్రాలను విభజించడం లాంటి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి. ఇప్పటికే యూపీని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్ ఉంది. మరి దీనికి కేంద్రం ఎలాంటి పరిష్కారం కనుగొంటుందో చూడాలి.