calender_icon.png 22 October, 2024 | 5:32 AM

నడిగడ్డలో రెడ్డి దర్బార్!

22-10-2024 12:38:36 AM

  1. నెక్లస్ పోయిందంటూ పేద బాలికపై పైశాచికత్వం 
  2. విచారణ పేరుతో హింసించిన పోలీసులు 
  3. అవమానభారంతోనే ఆత్మహత్యాయత్నం 
  4. విజయక్రాంతి’ కథనంతో వెలుగులోకి..

గద్వాల (వనపర్తి), అక్టోబర్ 21 (విజయక్రాంతి): దొరలు, పెత్తందారులు అమాయ కులైన నిరుపేదలతో వెట్టి చేయించుకుని హింసకు గురి చేసిన రోజులు ప్రస్తుత పరిస్థితుల్లోనూ కండ్ల ముందు కదలాడుతున్నా యి. అమాయక నిరుపేద బాలికతో వెట్టి చేయించుకుని బంగారు నెక్లస్ పోయిదం టూ నింద మోసి పోలీస్‌స్టేషన్ కేంద్రంగా అవమానపరిచడంతో ఆత్మహత్యాయత్నాని కి పాల్పడింది.

గద్వాల జిల్లాలోని ఓ ప్రధాన ప్రజాప్రతినిధి బంధువు అయిన సీడ్ వ్యాపా రి బండ్ల రాజశేఖర్‌రెడ్డి ఓ బాలిక (16)తో ఇంట్లో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు. తన కుటుంబ సభ్యుల వ్యక్తిగత అవసరాల కోసం నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలికను తక్కువ డబ్బులు ఇచ్చి పనిలో కుదుర్చుకున్నాడు.

చిన్న వయస్సులోనే తండ్రిని పోగొట్టుకొని, తినడానికి తిండీ లేని కుటుంబ నేపథ్యంతో బాలికను పని చేయించడం తల్లికి తప్పలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు శ్రీమంతుడు.. ఆ బాలికను చీటికి మాటికి చీదరించుకున్నా భరిస్తూ పని చేసింది. చివరికి బంగారు నెక్లస్ పోయిదం టూ దొంగతనం నింద మోపడంతో తట్టుకోలేకపోయింది.

డబ్బు, పొలిటికల్ పవర్‌ను అడ్డం పెట్టుకుని పోలీసుల చేత పోలీస్ స్టేషన్ కేంద్రంగా అవమానించడంతో భరించలేకపోయింది. చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ‘బాలికతో వెట్టి చేయించిన సీడ్ వ్యాపారి’ అనే వార్త కథనాన్ని ‘విజయక్రాంతి’ ప్రచురించి వెలుగులోకి తెచ్చింది.

దీంతో నడిగడ్డ హక్కు ల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్‌కుమార్ స్పందించి.. ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు. కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరా మర్శించి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు.

ఈ విషయాన్ని బయట చెప్పవద్దం టూ రెడ్డి కులస్థులు ఆ కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నట్టు ఆయన ఆరోపిం చారు. కాగా, బాలిక ఆత్మహత్యాయత్నానికి మరో బలమైన కారణం అయి ఉంటుందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల అత్యుత్సాహం 

బాలికతో వెట్టి చాకిరి చేయించుకుంటు న్న సదరు నేతలపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ముడుపులకు ఆశపడి బాలికనే పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించడం గమనార్హం. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి న బాలికను కాపాడుకునేందుకు తల్లి, బంధువులు పడుతున్న తాపత్రాయాన్ని మరిచి వారిని పోలీసులు బెదిరింపులకు గురిచేయడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే పరిస్థితి దాపురించింది.

తన కూతురిని కాపాడుకునే క్రమంలో అప్పులు చేసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించే ప్రయత్నంలో ఉన్న తల్లిని, బంధువులను.. మీకు ఈ డబ్బు లు ఎక్కడి నుండి వచ్చాయని పోలీసులు ప్రశ్నించినట్టు తెలిసింది. 

అంతా నాటకమేనా?

రెండు నెలల క్రితం ఇంట్లో బంగారం పోయిదంటూ బాలికను గద్దించిన సదరు సీడ్ వ్యాపారి.. బాలిక కుటుంబ సభ్యుల ను పిలిపించి రెండు రోజుల్లో తమ బం గారం తెచ్చి ఇవ్వాలంటూ హుకూం జారీ చేశారు. రెండు రోజుల తరువాత సదరు వ్యాపారి ఇంట్లోనే బంగారం దొరికేసరికి పని మాన్పించారు.

అనంతరం తాజాగా దసరాకు రెండు రోజుల ముందు పోలీసు లు అదుపులోకి తీవ్ర స్థాయిలో విచారించడంతో కుటుంబ సభ్యులు తమ పిల్లని వదిలేయాలని పోలీసులకు చెప్పాలంటూ రెడ్డి గారి కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డారు. అనంతరం పోలీసులు బంగారాన్ని తిరిగి తెచ్చి ఇవ్వాలని హెచ్చరిస్తూ వదిలేశారు. రెండు నెలల క్రితమే దొరికినట్టు చెప్పి మళ్లీ పోలీసులతో బెదిరింపులకు దిగడం తో ఆ బాలిక అవమానభారాన్ని తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడింది.