calender_icon.png 6 October, 2024 | 11:50 PM

పత్తి పంటకు ఎర్ర తెగులు

11-09-2024 01:27:07 AM

  • ఆందోళనలో అన్నదాతలు

ఈ ఏడాదీ అప్పుల భారమే 

42 లక్షల ఎకరాల్లో  పత్తి సాగు

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి):  రాష్ట్రంలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు ఎర్ర తెగులు సోకింది. పంట పూర్తిగా నీటి పాలైందని రైతులు కంట తడి పెడుతున్నారు. పెట్టుబడి కోసం లక్షలు అప్పు తెచ్చి పెడితే చివరకు కన్నీరే మిలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట కొన్ని చోట్ల ఎర్ర తెగులు బారినపడగా, మరికొన్ని చోట్ల వర్షపు నీరు నిల్వ ఉండటంతో  మొక్కలు చనిపోతున్నాయి.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 86 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఇందులో 42 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు.  సాధారణ పంటలు జూలైలో వేయగా, పత్తి పంట ముందుగానే జూన్ మొదటి వారంలోనే వేశారు. ఈ వానలకు నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూ బాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పత్తి రైతులు నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

పత్తి చేతికొచ్చే సమయంలోనే వానలు

ముందుగా వేసిన రైతుకు ఆగస్టులో కాయలు పగిలి పత్తి చేతికి వస్తుంది. ఆలస్యంగా వేసిన రైతులకు సెప్టెంబర్‌లో కాయలు పగిలి పంట చేతికి వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో వానలు వరుసగా కురువరడంతో చెట్టుకు పట్టిన కాయలు ఒకవైపు రాలిపోతుండగా మరోపక్క కాయపగిలి చేతికి రావాల్సిన పత్తి నల్లబడిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు భారీగా కురుస్తుండటంతో చాలా పంటలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. వర్షాలు ఇలాగే కురిస్తే తీవ్ర నష్టం తప్పదని భావిస్తున్నారు. పత్తికి ఎర్రతెగులు వస్తే పంట తొలగించటం తప్ప మరో మార్గం లేదని రైతులు వాపోతున్నారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా దిగుబడిలో మార్పు ఉండదని పేర్కొంటున్నారు.

ఈ ఏడాది కూడా అప్పుల భారమే..

 గత ఏడాది పత్తి పంటకు ఆశించిన స్థాయిలో ధరలు రావడంతో ఈ ఏడాది రైతులు పెద్దమొత్తంలో సాగు చేశారు. వేసిన పంట కూడా ఏపుగా పెరగడంతో పత్తి దిగుబడి బాగానే వస్తుందని ఆశపడ్డ అన్నదాతకు ఇటీవల కురిసిన వానలు కోలుకోలేని దెబ్బతీశాయి. కాయలు రాలిపోవడం, తెగులు రావడంతో పత్తి చేతికి రాక అప్పులు భారం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. దుక్కి దున్నినప్పటి నుంచి ఇప్పటివరకు ఎకరానికి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టామని, ఇందుకోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశామని వాపోతున్నారు. చేసిన కష్టానికి ఫలితం రాకున్నా ఫర్వాలేదని అప్పుల నుంచి బయట పడే విధంగా పాలకులు కరుణ చూపి పంట నష్టం పరిహారం పెంచాలని కోరుతున్నారు.

చేనులో నీరు నిల్వ లేకుండా చూడాలి: వ్యవసాయ శాఖ

రైతులు  చేనులో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నీరు నిల్వ ఉంటే పత్తి మొ క్కలు చనిపోతాయని, కాల్వలు తీసి నీటిని బయటకు పంపాలని చెప్తున్నారు. కార్బండైజం ఒక గ్రాము లీ టరు నీటిలో కలిపి మొక్కల మొద లు వద్ద పోయాలని సూచించారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆకు మచ్చ, కాయ కుళ్లు తెగు లు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.

కాయకుళ్లు వస్తే దిగుబడి భారీగా తగ్గుతుందని, ఆకుమచ్చ తెగులుతోపాటు ఆల్టేనేరియా ఆకు మాడిపోవడం, కాండంకు మాడు తెగులు కూడా వస్తుందని వెల్లడిస్తున్నారు. వీటిని అరికట్టేందుకు కార్బం డైజం, మాంకోజెబ్ 500 గ్రాము లు, టేబుకోనబుల్ 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలని పేర్కొన్నారు. కాయ కుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 600 గ్రామలు, స్రైటోమైసిన్ సల్పేట్ 60 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేస్తే పత్తి పంటను కొంత మేరకు కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.