07-03-2025 01:24:25 AM
కాటారం, మార్చి 6 : ఊరికి చెరువులు ఎంతో ఉపయోగకరమని భావించిన పెద్దల ఆశయాలకు భంగం కలిగించే రీతిలో చెరువులలోని మట్టి, ఎర్రమట్టి, మొరం దందా కొనసాగుతోంది. చెరువులలో మట్టి పూడిక తీయడానికి జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకొని, మార్గదర్శకాల మేరకు మాత్రమే మట్టి తవ్వకాలు చేపట్టాలని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని స్థానికంగా ఉన్న సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పల్లె ప్రజానీకానికి తీరని శాపంగా మారుతుంది.
సమాజానికి విఘాతం కలిగించే సందర్భం ఏదైనప్పటికీ, కట్టడి చేయాల్సిన పోలీస్ యంత్రాంగం, పంచాయతీరాజ్ శాఖలు కల్లుండి కబోది లాగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో నిత్యం మట్టి, ఎర్ర, మొరం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నిరాటకంగా సాగుతుంది.
తాజాగా మండలంలోని ఆదివారం పేట గ్రామపంచాయతీ కి చెందిన ఎర్ర చెరువులో మట్టి, ఎర్రమట్టి, మొరం తవ్వకాలను చేపడుతున్నారు. మండలంలోని ధన్వాడ జాధరావు పేట రోడ్డు పనులు చేస్తున్న పీడీఆర్ సంస్థ ఈ చెరువు నుండి మట్టి తరలిస్తోంది. ఉదయం సాయం సంధ్య వేళలో గత నెల రోజుల నుండి ఇష్టారీతిన మట్టి తరలింపు జరుగుతోందని గ్రామస్తులు తెలిపారు.
రహదారుల నిర్మాణానికి ఇరు ప్రక్కల సైడ్ బర్ములను ఏర్పాటు చేయడానికి మట్టి అవసరం ఏర్పడుతుండగా, సదరు కాంట్రాక్టర్లు అందుబాటులో గల అడవుల్లో లేదా చెరువుల్లో మట్టిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువుల్లోని మట్టిని తవ్వడానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి.
చెరువు పరిస్థితుల నేపథ్యంలో పూడిక మట్టి లాగా తీయడానికి మాత్రమే అవకాశాలు ఉండగా, అందుకు విరుద్ధంగా జెసిబి ప్రోక్లైన్ల ద్వారా గోతుల మాదిరిగా తవ్వుతూ, భారీ టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు జరుగుతోంది. చెరువులో మట్టి తీయడానికి మూడు నాలుగు ఫీట్ల లోతుతో సమాంతరంగా మట్టి తవ్వకాలు చేపట్టాలని మార్గదర్శకాలు పేర్కొంటుండగా, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన పంచాయతీ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు పత్తా లేకుండా పోవడంతో మోరం దందా నిర్వాహకులకు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది.
కాంట్రాక్టర్లు మట్టి తవ్వకాలు చేపడితే ప్రభుత్వానికి రాయల్టీ రూపేనా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టనట్లుగా అడ్డు అదుపు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు కాంట్రాక్టర్లు సైతం మట్టి తరలింపు యదేచ్ఛగా కొనసాగుతోంది. ప్రజా అవసరాలకు భిన్నంగా కొనసాగుతున్న కార్యకలాపాలను అదుపు చేయాల్సిన పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తూ మిన్నుకుండి పోతుందా అని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
చెరువులలో పెద్దపెద్ద గోతులు ఏర్పడడం వల్ల వర్షాకాలంలోని నీరు గుంతలలో నిలువ ఉండి, చెరువు కింది ఆయకట్టుకు ప్రయోజనం లేకుండా పోతుందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూము మత్తడి ద్వారా నీటి సరఫరా కావాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ చెరువులలో ఏర్పడిన నూతుల మాదిరిగా తలపిస్తున్న గోతుల వల్ల రాబోయే రోజుల్లో నీటి నిల్వలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
నీటి గుంతలలో పడి చిన్నారులు, చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన జాలర్లు, పశువులు ప్రమాదాలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం సంబంధిత శాఖలు చెరువులలో మట్టి, ఎర్ర మట్టి, మొరం దందాలను నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.
చెరువులలో మట్టి తవ్వకాల వల్ల మున్ముందు ప్రమాదాలు సంభవించకుండా, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించాలని, అందుకు అనుగుణంగా నిరంతరం సదరు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి, ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.