18-03-2025 12:00:00 AM
మెదక్, మార్చి 17(విజయక్రాంతి)ః ప్రభుత్వం నిరుపేదలకు అందించే రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. పలువురు మిల్లర్లు గ్రామాల్లో రేషన్ డీలర్లు, చిరు వ్యాపారుల ద్వారా పీడీఎస్ బియ్యం సేకరించి అదే బియ్యాన్ని సీఎంఆర్ పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం రవాణా చేసిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల పట్టుబడిన పీడీఎస్ బియ్యమే ఇందుకు నిదర్శనం. కాగా మిల్లర్లకు సివిల్ సప్లయ్ జిల్లా అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తక్కువ ధరకు సేకరణ...
జిల్లాలో 520 రేషన్ దుకాణాలు ఉండగా 1,99,917 ఆహార భద్రత కార్డులు, 13,871 అంత్యోదయ కార్డులు, 62 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. కాగా కొందరు ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారులు నాణ్యమైనవి పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కొత్త బియ్యం, దొడ్డు రకం బియ్యం, పలుమార్లు ముక్కిపోయినవి, పురుగులు పట్టిన, నూకలు కలిసిన బియ్యం పేదలకు పంపిణీ చేస్తున్నారు. దీంతో వాటిని తినేందుకు పేదలు ఇబ్బందు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు డీలర్లు, చిరు వ్యాపారులు పేదల దగ్గర నుంచి రూ..8 నుంచి రూ.10 మేరకు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
వారు పెద్ద వ్యాపారులకు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇంటి దొంగల మద్దతు...
పేదల బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన కొందరు సివిల్ సప్లయిస్ అధికారులు రీ సైక్లింగ్ దందాకు మద్దతు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేసి ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల మేరకు సివిల్ సప్లయిస్కు సీఎంఆర్ పెట్టాలి. ఈ వ్యవహారంలో బియ్యం పరిశీలించేందుకు పౌర సరఫరాల మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పలు పరీక్షలు చేయాలి.
బియ్యం ఎప్పుడు మిల్లింగ్ చేశారనే విషయం తెలుసుకునేందుకు కలర్ పరీక్ష చేయాలి. 25 శాతానికి మించి బ్రోకెన్ ఉండకుండా చూడాలి. బియ్యం కల్తీతో పాటు బియ్యంలో తౌడు శాతం ఎంత ఉందనే అంశాలను పరీక్షించాలి. ఈ పరీక్షలు చేస్తేనే ధాన్యం మిల్లింగ్ చేసి నేరుగా సీఎంఆర్ పెట్టారా..రేషన్ షాపులు, పేదల నుంచి బియ్యం సేకరించి సీఎంఆర్ పెట్టారా అనే విషయం తెలిసిపోతుంది.
అయితే సివిల్ సప్లయిస్ శాఖలో బియ్యం పరీక్ష చేసే అధికారుల్లో కొందరు ఒక్కో లారీ నుంచి రూ.20వేల నుంచి రూ.40వేల మేరకు ముడుపులు తీసుకొని బియ్యం పరీక్షలు నామమాత్రంగా నిర్వహించి బియ్యాన్ని సివిల్ గోదాంల్లోకి పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.