మార్చిలోపు కొత్త ప్రాజెక్ట్‌ల భూసేకరణ పూర్తి కావాలి
ఆనకట్టలు, కాలువల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం..
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): ఆనకట్టలు, కాలువల భద్రత, పర్యవేక్షణకు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 1,800 మంది లష్కర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులపై జాతీ య ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నుంచి తుది నివేదికను త్వరగా తెప్పించాల ని సూచించారు.
అలాగే వానకాలంలో నిర్వహించాల్సిన పరీక్షలను త్వరగా పూర్తి చేసి, నివేదికలు సేకరించాలని సూచించారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుంచి రావాల్సిన అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ ప్రాజె క్టు విషయంలో కేంద్ర జల వనరుల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమ్మక్క ప్రాజెక్ట్ నష్టపరిహారం విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలు జర పాలని తేల్చిచెప్పారు. ఆనకట్టలు, కాలువల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. వచ్చే ఏడా ది మార్చి నాటికి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి సూచనలపై నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా స్పందిస్తూ.. లష్కర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కావొచ్చిందని, కేవలం ఆర్థికశాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉందని సమాధానమిచ్చారు. మంత్రి వెంటనే స్పందిస్తూ.. రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో మాట్లాడి అనుమతులు పొందాలని సూచించారు.