calender_icon.png 9 October, 2024 | 4:59 AM

నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

09-10-2024 02:34:19 AM

ఎల్బీ స్టేడియంలో అందించనున్న సీఎం రేవంత్ 

11,062 పోస్టుల్లో 10,006 మందికి ఉద్యోగాలు

కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో 1056 పోస్టులు

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): డీఎస్సీ-2024లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు బుధవారం అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని స్వయంగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేశారు. మొత్తం 11,062 పోస్టుల్లో 10,006 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీరికే ముందస్తుగా నియామకపత్రాలు అందించనున్నా రు. కోర్టు కేసుల కారణంగా మరో 1,056 స్పెషల్ ఎడ్యుకేషన్‌తోపాటు ఇతర కొన్ని పోస్టులు పెండింగ్‌లో పడ్డాయి.

20 జిల్లాల్లోనే స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. మరో 13 జిల్లాల్లో కోర్టు కేసుల కారణంగా చేపట్టలేదు. జనరల్ పోస్టులకు సంబంధించి మరికొంత మందికి మెడికల్ చెకప్ నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలిపారు. 

ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష..

నియామక పత్రాలు అందుకోబోయే అభ్యర్థల జాబితా జిల్లాలకు మంగళవారమే చేరింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులంతా ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని అభ్యర్థులకు అధికారులు మెస్సేజ్‌లు, ఫోన్‌ల ద్వారా సమాచారమిచ్చారు. జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా అభ్యర్థులను తరలించనున్నారు.

ఈ క్రమంలోనే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా కలెక్టర్లకు పంపించామని, అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు సీఎస్‌కు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వివరించారు.

జిల్లాల నుంచి వచ్చే బస్సులు సజావుగా ఎల్బీ స్టేడియానికి చేరుకునేలా 33 మంది నోడల్ అధికారులను నియమించినట్లు సీఎస్‌కు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అభ్యర్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులు సరైన సమయానికి ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరేలా చూడాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. నియామక పత్రాలు అందుకున్న తర్వాత కూడా అభ్యర్థులు తమ ఇళ్లకు సాఫీగా చేరుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

భర్తీ అయిన పోస్టులు..

11,062 పోస్టుల్లో 10,046 జనరల్ పోస్టులుండగా, 1016 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులున్నాయి. అయితే 33 జిల్లాల్లోని 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు గానూ 2,515 పోస్టులు నింపినట్లు అధికారులు జాబితా విడదుల చేశారు. లాంగ్వేజ్ పండిట్‌ల్లో 727లో 685, పీఈటీ 182లో 145, ఎస్జీటీ పోస్టులు 6,508లో 6,277 నింపారు. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ 220 పోస్టుల్లో 103, స్పెషల్ ఎస్జీటీ 796 పోస్టుల్లో 281 ఖాళీలు భర్తీ అయ్యాయి.