calender_icon.png 9 October, 2024 | 2:44 AM

రూ.7.50 లక్షల కోట్ల సంపద రికవరీ

09-10-2024 12:57:19 AM

6 రోజుల పతనానికి బ్రేక్

సెన్సెక్స్ 585 పాయింట్లు జంప్

25,000 పాయింట్ల ఎగువకు  నిఫ్టీ

ముంబై, అక్టోబర్ 8: ఎట్టకేలకు మార్కెట్ వరుస పతనాలకు మంగళవారం బ్రేక్‌పడింది. హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల్లో జరిగిన భారీ కొనుగోళ్లతో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 585 పాయింట్లు లాభపడింది. ఇంట్రాడేలో 713 పాయింట్ల వరకూ పెరిగి 81,763 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన అనంతరం 81,634 పాయింట్ల వద్ద నిలిచింది.

  ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  ఇంట్రాడేలో 25,044 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన తర్వాత చివరకు 217 పాయింట్ల లాభంతో కీలకమైన 25,000 పాయింట్ల ఎగువన 25,013 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గత ఆరు ట్రేడింగ్  రోజుల్లో సెన్సెక్స్ 4,500 పాయింట్లకుపైగా  క్షీణించింది.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.17 కోట్ల మేర హరించుకుపోయింది. అయితే మంగళవారం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు రూ.7.51 లక్షల కోట్ల సంపదను రికవరీ చేసుకోగలిగారు. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్కసారిగా రూ.7.51 లక్ష కోట్లు పెరిగి రూ.4,59,50,926 లక్షల కోట్లకు (5.47 ట్రిలియన్ డాలర్లు) చేరింది. 

హర్యానా ఫలితం ప్రభావం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఈక్విటీలకు ఇన్వెస్టర్ల తాజా మద్దతు లభించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. వరుస పతనాల తర్వాత నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 25,800 పాయిం ట్ల వద్ద మద్దతు పొందడంతో ర్యాలీ జరిగిందని చెప్పారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావి తం చేసిందని స్టాక్స్‌బాక్స్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ అమేయా రణదివే తెలిపారు. 

అదానీ పోర్ట్స్ టాపర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 4.5 శాతం జంప్‌చేసింది.  మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రో, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అల్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 3 శాతం వరకూ ర్యాలీ జరిపాయి.

మరోవైపు టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీ, టాటా మోటా ర్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లు తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా సర్వీసెస్ ఇండెక్స్ 3.25 శాతం పెరిగింది.

క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.82 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 2.81 శాతం, పవర్ ఇండెక్స్ 2.44 శాతం, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 2.35  శాతం చొప్పున పెరిగాయి. ఒక్క మెటల్ ఇండెక్స్ మాత్రం నష్టపోయింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 2.44 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.86 శాతం చొప్పున లాభపడ్డాయి.

కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు మంగళవారం సైతం కొనసాగాయి. తాజాగా ఎఫ్‌పీఐలు రూ.5,728 కోట్ల విలువైన షేర్లు విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాం కాలు వెల్లడిస్తున్నాయి. గత ఆరు  ట్రేడింగ్ రోజుల్లో విదేశీ ఫండ్స్ దాదాపు రూ.50,000 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడుల్ని విదేశీ ఫండ్స్ వెనక్కు తీసుకున్నాయి.

ఖరీదైన భారత్ ఈక్విటీల నుంచి చౌకగా లభిస్తున్న చైనా, హాంకాంగ్ మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలిస్తున్నారని, ఇటీవల చైనా కేంద్ర బ్యాంక్ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను పున రుత్తేజపర్చి, అక్కడి కంపెనీల లాభాలు పెరగడానికి దోహదపడుతుందన్న భావన విదేశీ ఫండ్స్‌లో నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ వివరించారు.