- కేంద్రం అందించిన మద్దతుతోనే సాధ్యం
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతుతో తెలంగాణలో సోయాబీన్ సేకరణ ఎన్నడూ లేనంతగా 53,617 మెట్రిక్ టన్నులకు పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
శనివారం అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులతో వ్యవసాయంలో వస్తున్న సంస్కరణలపై సలహాలు, సూచనల అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.. ఆయిల్ పామ్ విస్తరణలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
ఇప్పటికే లక్ష హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగులోకి వచ్చిందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 4లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడానికి ప్రణాళిక చేసినట్లు వివరించారు. రాష్ర్ట ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కనీస మద్దతు ధర రూ. 20,000(టన్ను పామాయిల్ గెలలకు) ఉండేటట్లు చూడాలని కేంద్ర మంత్రికి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
దిగుమతి సుంకం పెంచినట్లయితే రాష్ర్ట రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు కొన్నేళ్లుగా రాష్ర్టంలో పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను సబ్సిడీ ధరకు అందిస్తున్నామని, వీటిని మరింతగా ప్రోత్సహించడానికి కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ర్టంలో పండించే పసుపు, మిర్చికి కూడా కనీస మద్దతు ధర ప్రకటించే విషయాన్ని పరిశీలించాలన్నారు.
డ్రిప్ పరికరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనార్థం ధరలను పునఃపరిశీలించాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామన్నారు. నాసిరకాల విత్తనసాగుతో పంటనష్టపోయిన నేపథ్యంలో సదరు విత్తన కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా విత్తన చట్టంలో సవరణలు చేయాలని కోరారు.