- 5 నెలల్లో 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల భర్తీ
- సీఎం చేతుల మీదుగా రేపు నియామక పత్రాలు
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగంపై కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈక్రమంలోనే 5 నెలల్లోనే 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేసింది. 11 నెలల్లోనే 7,332 పోస్టులు భర్తీ చేసిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. తాజాగా ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు బోర్డు జూన్ 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తదితర ప్రక్రియల అనంతరం నవంబర్ 23న సెలక్షన్ లిస్టును విడుదల చేసింది.
ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్లకు సోమవారం(ఈనెల 2న) సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించనున్నారు. అధికారం చేపట్టి ఏడాది గడవక ముందే సుమారు 54వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.
ఆరోగ్యశాఖలోనే 7,774 పోస్టులను భర్తీ చేయగా.. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 732 ఫార్మసిస్ట్(గ్రేడ్-2) పోస్టులు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టు లు, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్(ఎంఎన్‌జే) పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
త్వరలోనే మరో 600కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్యశాఖలో నియామకాల ప్రక్రియ పారదర్శకంగా చేపడతామని మంత్రి దామోదర రాజనర్సింహ ఇదివరకే వివరించారు.
ఆరోగ్యశాఖలో భర్తీ అయిన పోస్టుల వివరాలు..
నర్సింగ్ ఆఫీసర్ 6,956
సివిల్ అసిస్టెంట్ సర్జన్ 442
ల్యాబ్ టెక్నీషియన్ 285
ఫిజియోథెరపిస్ట్ 48
ఫుడ్ ఇన్స్‌పెక్టర్ 24
డ్రగ్ ఇన్స్‌పెక్టర్ 18
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 01
మొత్తం పోస్టుల సంఖ్య 7,774