calender_icon.png 9 October, 2024 | 9:59 PM

విదేశీ మారక నిల్వల రికార్డు

05-10-2024 12:00:00 AM

తొలిసారిగా 700 బిలియన్ డాలర్లను మించిన ఫారెక్స్

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశం వద్దనున్న వి దేశీ మారక నిల్వలు సరికొత్త రికార్డు గరిష్ఠస్థాయికి చేరాయి. శుక్రవారం ఆర్బీఐ  తాజా గణాంకాల ప్రకారం  సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు భారీగా 12.588 బిలియన్ డాల ర్లు పెరిగి 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరాయి.

700 బిలి యన్ డాలర్ల స్థాయిని అధిగమించడం ఇదే ప్రధమం. అలాగే ఒకే వారంలో ఇంతగా ఫారెక్స్ నిల్వలు పెరగడం ఇదే తొలిసారి.  విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 10.468 బిలియన్ డాలర్లు పెరిగి 616.154 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.

అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

పెరిగిన బంగారం నిల్వలు

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో  2.184 మిలియన్ డాలర్లు పెరిగి 65.796  బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 8 మిలియన్ డాలర్లు పెరిగి18.547 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 71 మిలియన్ డాలర్లు  తగ్గి 4.387 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.