calender_icon.png 27 November, 2024 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి

06-11-2024 01:39:22 AM

  1. దిగుమతి కోసం పక్క రాష్ట్రాలే కాకుండా, విదేశాలు ఆసక్తి 
  2. 47 లక్షలటన్నుల సన్నాలు కొనుగోలు చేస్తాం
  3.  పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయ క్రాంతి): రాష్ట్రం ధాన్యం దిగుబడిలో రికార్డ్ సృష్టిస్తోందని, యావత్ భారత్‌లోనే ఈ స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిన సంద ర్భం ఎప్పడూ లేదని పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 150 లక్షల ధాన్యం దిగుబడి ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. 60.80 లక్షల ఎకరాలలో ప్రభుత్వం అంచనా వేసిన దిగుబడిలో 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. అందులో 47 లక్షల టన్నులు సన్నాలుగా,44 లక్షలు దొడ్డు రకం ఉంటాయని తెలిపారు.

ఖరీఫ్ నుండి సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 ప్రకటించడంతో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. దిగుబడిలో సన్నాలు 47 లక్షల అంచనా వేయగా వీటి కొనుగోలుకు రూ. 30 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 వేల కోట్లు విడుదల చేసిందని, పరిస్థితులను బట్టి అదనంగా నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోలులో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు అయోమయంలో పడకుండా ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కలిపించి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలని  స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. రాష్ర్ట వ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

తెలంగాణా బియ్యానికి  డిమాండ్

తెలంగాణా బియ్యానికి బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు. రెండు మూడు బయటి దేశాలు కూడా దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. 

నిబంధనల ప్రకారం కొనుగోళ్లు

 కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, తేమ శాతంలో రైతులకు అవగాహన కల్పిం చాలని సూచించారు.ప్రకృతి విపత్తులతో అవాంతరాలు సంభవించిన పక్షంలో అధిగ మించేందుకు అధికారులను సన్నద్ధం చేయా లని పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహా న్‌ను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడ్పాటును అందించాలని, సీఎంఆర్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంద న్నారు. సన్నాలకు రూ. 10 నుంచి రూ. 50లకు, దొడ్డు రకానికి రూ. 10 నుండి రూ. 40లకు పెంచామన్నారు. నిబంధనల మేరకే బ్యాంక్ గ్యారెంటీ పెట్టామని స్పష్టం చేశారు. కేవలం 10 నెలల వ్యవధిలోనే రూ. 11,537.40 కోట్ల రుణ భారం తగ్గించుకున్న ట్లు ఆయన వెల్లడించారు.