- కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధం లేకుండానే ఉత్పత్తి
- ప్రాజెక్ట్‌పై బీఆర్‌ఎస్ నేతలది తప్పుడు ప్రచారం
- కాంగ్రెస్ పాలకులు నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టులతోనే ఈ విజయం
- ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): కాళేశ్వరంతో ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పిత్తి సాధ్యమైందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలకులు నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్సార్‌ఎస్పీ, దేవాదుల, శ్రీపాద, ఎల్లంపల్లి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే ఈ ఘనత సాధ్యమైందని కొనియాడారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవానికి విచ్చేశారు. తొలుత ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ‘ఇండియా గుండె చప్పుడు ఇందిరా’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కాళేశ్వరంతో సాగు విస్తీర్ణం పెరిగిందని బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రాజెక్ట్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెప్పామని గుర్తుచేశారు. తర్వాత మేడిగడ్డ కుంగిందని, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయలేకపోయామని స్పష్టం చేశారు.
గతంలో కాంగ్రెస్ పాలకులు నిర్మించే ప్రాజెక్ట్‌లే ఇప్పుడు సాగుకు వరంగా మారాయని కొనియాడారు. తమ ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించిందని, కేవలం 15 రోజుల్లో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిందని వివరించారు. 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు పంట నష్టం పరిహారం ఇవ్వలేదని, తాము అధికారంలోకి రాగానే వరదల బీభత్సంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిచామన్నారు.
పంటల రక్షణ కోసం రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నదని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, పాలీ హౌస్, సబ్సిడీ విత్తనాల పంపిణీ తదితర పథకాలను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. తాము వాటన్నింటినీ సమగ్రంగా అమలు చేస్తున్నామని వివరించారు. తాము ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేశామన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ప్రధాని ఇందిరా గాంధీ మాత్రమే అని ఆయన కొనియాడారు. ఇందిరాగాంధీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని. వాటిలో బ్యాంకుల జాతీయికరణ, రాజభరణాల రద్దు వంటివి కీలకమైనవన్నారు.
రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. రైతును ఆర్థికంగా బలోపేతం చేసి రాజుగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక ఇబ్బందులున్నా రూ.18 వేల కోట్ల మేర రుణమాఫీ చేశామని తెలిపారు.