న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు కొత్త రికార్డు గరిష్ఠస్థాయిని చేరాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టు 30తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 2.299 బిలియన్ డాలర్లు పెరిగి 683.987 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం వారం ఇవి 7.023 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 681.688 బిలియన్ డాలర్లకు పెరిగాయి. తాజా సమీక్షా వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.485 బిలియన్ డాలర్లు ఎగిసి 599.037 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
బంగారం నిల్వలూ పెరిగాయ్
దేశం వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో 862 మిలియన్ డాలర్లు పెరిగి 61.859 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 9 మిలియన్ డాలర్లు పెరిగి18.468 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు మాత్రం 58 మిలియన్ డాలర్లు తగ్గి 4.622 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.