13-07-2024 12:10:48 AM
ముంబై, జూలై 12: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు కొత్త రికార్డుస్థాయికి చేరాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలై 5తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు ఒక్కసారిగా 5.158 బిలియన్ డాలర్ల మేర 657.155 బిలియన్ డాలర్ల కొత్త రికార్డుస్థాయికి పెరిగాయి జూన్ తొలివారంలో 655.817 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరుకున్న తర్వాత ఈ నిల్వలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి.
గత జూన్ 28తో ముగిసిన వారంలో ఇవి 1.713 బిలియన్ డాలర్లు తగ్గి 651.997 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. తాజాగా జూలై 5తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 4.228 బిలియన్ డాలర్లు పెరిగి 577.11 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
బంగారం నిల్వలూ పెరిగాయ్
దేశం వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో 904 మిలియన్ డాలర్లు మేర పెరిగి 57.432 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్ లు) 21 మిలియన్ డాలర్లు పెరిగి 18.036 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్ద నున్న రిజర్వులు 4 మిలియన్ డాలర్లు పెరిగి 4.578 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.