- 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలి
- ప్రజారోగ్యం, భద్రత ఏర్పాట్లు పూర్తయ్యేదాకా అదనపు షోలకు అనుమతించొద్దు
- ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏ నిబంధన ప్రకారం రేట్లను పెంచారో పేర్కొనలేదని, అందువల్ల ఈ ఉత్తర్వులను పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
భవిష్యత్తులో ప్రజారోగ్యం, భద్రతకు సంబం ధించిన విషయాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు జరిగేలా చూసేంతవరకు తెల్లవారుజామున షోలకు అనుమతించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ ధరల పెంపునకు జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో పునఃసమీక్షించాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
గేమ్ ఛేంజర్ సినిమా అదనపు షోలకు, టికెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టి బెనిఫిట్ షోలకు అనుమతివ్వడం లేదంటూనే అదనపు షోల పేరుతో వాటికి ప్రభుత్వం అనుమతించడాన్ని తప్పుబట్టారు.
బెనిఫిట్ షోలకు అనుమతించమన్న ప్రభుత్వం పరోక్షంగా అనుమతి మంజూరు చేసిందన్నారు. రాత్రి పడుకోవాల్సిన సమయంలో సినిమాలేంటని ప్రశ్నించారు. 16 ఏళ్లు నిండని వారికి అర్ధరాత్రి దాటిన సినిమాలకు, పబ్బుల్లోకి అనుమతించరాదని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇలాగే నిబంధనలను ఉల్లంఘిస్తూ వస్తే రాత్రి 11 గంటలు దాటిన తర్వాత సినిమా థియేటర్లు, పబ్బుల మూసివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు.