calender_icon.png 24 September, 2024 | 11:57 PM

అవినీతి అధికారులపై కేసులకు సిఫార్సు!

24-09-2024 12:24:38 AM

రేపటి నుంచి శనివారం వరకు కాళేశ్వరం విచారణ

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసే యోచనలో కాళేశ్వరం విచారణ కమిషన్ ఉన్నట్లు సమాచారం. వీరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే ఆలోచనలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరిపిన విజిలెన్స్ విభాగాన్ని త్వరగా తుది నివేదిక ఇవ్వాలని కమిషన్ అదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తిరిగి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. శనివారం వరకు వరుసగా ఇంజినీర్లను విచారించనున్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. అప్పటి ఈఎన్సీలను కూడా కమిషన్ ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖను కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్‌మెంట్ రిజిస్టర్, ఎం బుక్స్ కూడా తీసుకురావాలని ఇంజినీర్లను కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం నివేదిక ఆధారంగా కాగ్ అధికారుల నుంచి కూడా వివరాలు తీసుకునేందుకు కమిషన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.