మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక పోరాటానికి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు వేదికయ్యాయి. ఈ ఎన్నికలు నాలుగు పార్టీలకు చావో రేవోలాంటివి కాగా, రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ ఆరు పార్టీల్లో శివసేన, ఎన్సీపీలు నాలుగు కాగా, జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌లు మిగతావి. ఈ ఆరు పార్టీలు రెండు కూటములుగా ఏర్పడి అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి.
అధికార మహాయుతి కూటమిలో బీజేపీతో పాటుగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చీలిక వర్గం, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి ‘మహాఘట్‌బంధన్’లో కాంగ్రెస్‌తో పాటుగా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్‌పవార్‌కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందునుంచే రెండు కూటముల్లోని పార్టీలు సీట్ల పంపిణీకి సంబంధించిన కసరత్తును పూర్తి చేసినప్పటికీ అభ్యర్థుల ఎంపిక దగ్గరికి వచ్చేసరికి రెబెల్స్ బెడద ఎక్కువైంది.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గత నెల 29తో నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయానికి మొత్తం 288 స్థానాలకు 7,995 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఆఖరు రోజే దాదాపు 5వేల మంది నామినేషన్లు దాఖలు చేయడాన్ని బట్టి చూస్తే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతుంది. రెండు కూటముల మధ్య పోటీ చేసే స్థానాలపై స్పష్టమయిన అవగాహన ఉన్నప్పటికీ ప్రతి పార్టీనుంచి అంతకుమించి నామినేషన్లు దాఖలు కావడం విశేషం.
మరోవైపు రెండు కూటముల్లోని పలువురు నేతలు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వీరి సంఖ్య 50కి పైగానే ఉంది. అత్యధికంగా బీజేపీ తరఫున 148 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌నుంచి కూడా 103 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే ఈ రెండు పార్టీల టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగడంతో ఆ పార్టీలు వీరిని బుజ్జగించడం ఎలాగో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి.
రెబెల్స్ బెడద కమలం పార్టీకే ఎక్కువగా ఉంది. ఈ పార్టీనుంచి టికెట్ ఆశించి భంగపడిన దాదాపు 19 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఇక ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకూ రెబెల్స్ బెడద ఎక్కువగానే ఉంది. ఈ వర్గానికి చెందిన 16 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగారు. ‘మహావికాస్ అఘాడీ’ కూటమి విషయానికి వస్తే కాంగ్రెస్‌నుంచి 10 మంది, ఉద్ధవ్ థాక్రే వర్గంనుంచి మిగతా వారు రెబెల్స్‌గా ఉన్నారు.
ఇదేకాకుండా కీలక నియోజకవర్గాల్లో ఆయా కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన పలువురు నేతలు అధికార అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేయడం, లేదా కుటుంబ సభ్యులతో నామినేషన్లు వేయించడం జరిగింది. దీంతో రెండు కూటముల్లోను ఈ రెబెల్స్ అధికార అభ్యర్థుల విజయవకాశాలను ఎక్కడ దెబ్బతీస్తారోనని ఆయా పార్టీలు భయపడుతున్నాయి. అంతేకాదు, రెండు కూటముల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉండడంతో వీరు ఎక్కడ తమ విజయావకాశాలకు గండి కొడతారోనని అభ్యర్థులూ ఆందోళన చెందుతున్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరి రోజు కావడంతో ఆ లోగా బరిలోంచి తప్పుకునేలా తిరుగుబాటు అభ్యర్థులను ఒప్పించడానికి ఆయా పార్టీల నేతలు చెమటోడుస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న దాదాపు 9 స్థానాల్లో షిండే వర్గానికి చెందిన శివసేన రెబెల్స్ పోటీలో ఉండడం జాతీయ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇదే పరిస్థితి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకీ ఎదురవుతోంది.
రెబెల్స్ పరిస్థితిని అర్థం చేసుకుని పోటీనుంచి తప్పుకుంటారన్న ఆశాభావాన్ని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యక్తం చేశారు. ఈ నెల 4వ తేదీ తర్వాత వీరిలో ఎంతమంది తప్పుకున్నారో స్పష్టమవుతుంది.