- రైతులపై నీకున్న ప్రేమ ఇంతేనా?
- కొడంగల్ ప్రజలకు అండగా ఉంటాం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి)/ కాప్రా : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల తిరుగుబాటు మొద లైందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మా భూములు మాకు కావాలని కొన్ని నెలలుగా ప్రజలు పోరాటం చేస్తున్నా.. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి వారిని పిలిచి మాట్లాడకపోగా.. రౌడీలు, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తో గురువారం హరీశ్‌రావు ములాఖత్ అయ్యారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ.. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ తయారుచేసిన 14వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేసేందుకు సీఎం పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతున్నాడని ధ్వజమెత్తారు.
బడా ఫార్మా కంపెనీల మీద, అల్లుడి మీద ఉన్న ప్రేమ.. రైతులు, గిరిజనులపైనా లేదా? అని సీఎంను ప్రశ్నించారు. విద్యార్థులు తిరగబడినా, రైతులు రోడ్లమీదుకొచ్చినా, పోలీసులు ధర్నాలు చేసినా, చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడుతున్నా అందులో బీఆర్‌ఎస్ కుట్ర ఉందంటూ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
మల్లన్నసాగర్‌లో రెండ్రోజులు నిరాహార దీక్షలు చేస్తే అడ్డుకోకుండా రక్షణ కల్పించిన విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. కేటీఆర్, నరేందర్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టినా.. నిన్ను గద్దె దించే విషయాన్ని ప్రజలు మర్చిపోరన్నారు. కొడంగల్, జహీరాబాద్‌లో ఫార్మాసిటీ భూముల సేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు.
ప్రశ్నించే గొంతుక కేటీఆర్‌కు సమాధా నం చెప్పలేక కుట్ర చేస్తున్నారని మండిపడ్డా రు. రిమాండ్ రిపోర్టులో ఏం ఉందో తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తప్పుడు రిపోర్టులో నరేందర్‌రెడ్డితో సంతకం పెట్టించారని.. ఇదే విషయాన్ని నరేందర్‌రెడ్డి మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారన్నారు.