calender_icon.png 8 October, 2024 | 6:00 AM

సింగరేణికి భరోసా

08-10-2024 03:12:05 AM

ఖాళీ ప్రదేశాల్లో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు

సింగరేణిలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్

కార్మికుల కుటుంబాల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 

బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి, సింగరేణి ఎమ్మెల్యేలు హాజరు

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): సింగరేణి భవిష్యత్‌కు భరోసా నిచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

సింగరేణి లాభాల విషయంలో గత సర్కారు మాదిరిగా దాపరికాలు చేయడం లేదని స్పష్టంచేశారు. లాభాల్లో కొంత కొత్త గనులను ప్రారంభించడానికి, ఇతర వ్యాపారాలు చేయడానికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి సమక్షంలో భట్టి బోనస్ చెక్కుల పంపిణీ చేశారు.

లాభాల్లో వాటా కింద ఒక్కో కార్మికుడు రూ.1.90 లక్షల చొప్పున, దీపావళి బోనస్ కింద ఒకరికి రూ.93,750 చొప్పున, అడ్వాన్స్ కింద ఒకరికి రూ.25 వేల చెప్పున చెక్కులను డిప్యూటీ సీఎం అందజేశారు. లాభాల వాటా, దీపావళి బోనస్, పండగ అడ్వాన్స్ కలిపి మొత్తం రూ.1,261 కోట్ల చెక్కులను యాజమాన్యం కార్మికులకు చెల్లించింది.

లాభాల్లో వాటా టాపర్‌గా శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న ఎస్‌డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్ నిలిచారు. ఈయన రూ.3.24 లక్షల బోనస్ తీసుకున్నారు. ఆసం శ్రీనివాస్ ఏడాదిలో 304 రోజులు పనిచేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం తొలిసారి గా లాభాల్లో వాటా కింద రూ.5 వేలను అందజేసింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సింగరేణి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని, సంస్థను ఇతర మార్గాల్లో కూడా విస్తరించనున్నట్టు వెల్లడించారు. ఖనిజ పరిశ్రమల్లో కూడా సంస్థను విస్తరించాడనికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. 

విశ్రాంత కార్మికులకు వైద్య సాయం పెంపు

రానున్న కాలంలో బొగ్గు నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే సింగరేణి మనుగడ కోసం లిథియం వంటి ఇతర పరిశ్రమల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. థర్మల్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు ఇతర గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను కూడా చేపట్టబోతున్నట్టు వివరించారు.

ఈ మేరకు కొన్ని విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించా రు. సింగరేణి ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

విశ్రాంత కార్మికులకు ప్రస్తుతం అమలవుతున్న సీపీఆర్‌ఎంఎస్ వైద్య సేవల పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు చెప్పారు. వారికి గృహాల కోసం స్థలాలు ఇచ్చే అంశంపై వివరాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ పెంపుదలపై కూడా ఆలోచన చేస్తామని పేర్కొన్నారు.

సింగరేణి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

సింగరేణి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టంచేశారు. తాను కూడా కొత్త గనుల కోసం కేంద్రంతో మాట్లాడినట్టు చెప్పారు. ఒడిశా సీఎంతో కూడా చర్చించిన ట్టు వెల్లడించారు. సింగరేణి వ్యాప్తంగా ని యోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చే యబోతున్నట్టు ప్రకటించారు.

అలాగే, కార్మికులకు అత్యుత్తమ సేవలను అందించడం కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకోల్పనున్నట్టు వివరించారు. ఈ నెల 11న సింగరేణి గనుల్లో కార్మికులకు దసరా విందును ఏర్పాటు చేయబోతున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు.

సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం, ఉత్తత్తిలో ఖర్చులకు సంబంధించిన వ్యత్యాసాలను కార్మికులకు వివరించడం కోసం ఈ విందును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకుంటేనే సింగరేణి మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అత్యుత్తమ విద్యను అందించాలి: మంత్రి పొంగులేటి 

సింగరేణి కార్మికులకు హైదరాబాద్ తరహా అత్యుత్తమ స్థాయి విద్యను అందించేందుకు పాఠశాలలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. అలాగే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్ రావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కోరం కనకయ్య, మట్టా రాగమ యి, గండ్ర సత్యనారాయణ, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, వేతనాల కమిటీ చైర్మన్ జనక్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమం: మంత్రి శీధర్‌బాబు

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని తమ ప్రభుత్వ హయంలోనే ఏర్పాటు చేశామ ని చెప్పారు. తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులను గుర్తించి, వారికి కూడా బో నస్ ఇచ్చినట్టు స్పష్టంచేశారు. ఇది ఇకపై కూడా కొనసాగుతుందని చెప్పారు.