calender_icon.png 25 November, 2024 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనంద్ సినీ సర్వీసెస్‌కి భూ కేటాయింపు సబబే

18-05-2024 12:20:56 AM

చిత్రపరిశ్రమ ప్రోత్సాహకాల్లో భాగమే 

హైకోర్టు స్పష్టీకరణ.. పిల్ కొట్టివేత 

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా గోల్కొండ మండలం షేక్‌పేటలో ఆనంద్ సినీ సర్వీసెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని తప్పు పట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సర్వే నంబర్ 403లో 5 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేయించడాన్ని సమర్థించింది. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగానే ఉందని పేర్కొన్నది. భూ కేటాయింపులో ప్రభుత్వం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించలేదని తేల్చిచెప్పింది.

సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాదుకు తరలించడంలో భాగంగా పరిశ్రమను ప్రోత్సహించడానికి భూకేటాయింపులు ప్రభుత్వ విధానంలో భాగమని వెల్లడించింది. భూకేటాయింపును సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. 

ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపు

ఐదెకరాల భూమిని ఆనంద్ సినీ సర్వీసెస్‌కు కేటాయిస్తూ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జారీచేసిన జీవో 744, 2001లో జారీచేసిన జీవో 355ను సవాల్ చేస్తూ హరీశ్‌రావు 2008లో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్‌అరాదే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. ఎకరం రూ.8,500 చొప్పున 5 ఎకరాలను ఆనంద్ సినీ సర్వీసెస్‌కు కేటాయించాలని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌ఏసీ)ని ఆదేశిస్తూ 2001లో ప్రభుత్వం జీవో 355ను జారీ చేసింది. ఈ జీవోను 2002లో నిలిపివేసింది. 2008లో ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.

ఆనంద్ సినీ సర్వీసెస్‌కు 5 ఎకరాలను రిజిస్టర్ చేయాలని ఏపీఎస్‌ఎఫ్‌ఎసీని ఆదేశిస్తూ జీవో జారీ ఇచ్చింది. ఎలాంటి ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా, మంత్రివర్గం సలహా లేకుండా, మార్కెట్ విలువను పట్టించుకోకుండా తక్కువ ధరకే భూమిని కేటాయించారని హరీశ్‌రావు తన పిల్‌లో వాదించారు. ఈ భూకేటాయింపుతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని, అందువల్ల భూ కేటాయింపులు రద్దు చేయాలని హరీశ్‌రావు తరఫు న్యాయవాది కోరారు.

ఈ వాదనను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వ్యతిరేకించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా 1982లో తెచ్చిన ప్రభుత్వ విధానం ప్రకారమే భూకేటాయింపు జరిగిందని తెలిపారు. గతంలో పద్మాలయ స్టూడియోకు 9.5 ఎకరాలు, సురేశ్ ప్రొడక్షన్స్‌కు 5 ఎకరా భూమిని ప్రభుత్వం కేటాయించిందని, ఆ తర్వాత సమాచారశాఖ విజ్ఞప్తి మేరకు ఏపీఎస్‌ఎఫ్‌ఏసీకి 35.48 ఎకరాలు కేటాయించిందని వివరించారు. పిటిషనర్ మంత్రిగా ఉన్న సమయంలో దర్శకుడు శంకర్‌కు భూకేటాయింపు జరిగిందని, దీనిపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు.

ఆనంద్ సినీ సర్వీసెస్‌కు 80 బస్సులున్నాయని, ఔట్ డోర్ షూటింగ్ ఏర్పాట్లు చేయడంలో ఈ సంస్థ సినీ పరిశ్రమకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం టెండర్లు లేకుండా ప్రభుత్వం భూకేటాయింపులు చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే, అది రాజ్యాంగంలోని అధికరణ 14కు అనుగుణంగా, వివక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నది. 2001లో జీవో జారీ అయితే ఏడేళ్లకు పిల్ దాఖలు చేశారని, ఈ వ్యవహారంలో తాము విచక్షణాధికారాలను వినియోగించి ఆ నాటి నిర్ణయాలపై సమీక్ష చేయలేమని తేల్చి చెప్పింది. పిల్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.