calender_icon.png 1 November, 2024 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్టీ.. ఉపాధిలో మేటి

12-05-2024 01:58:52 AM

దేశవ్యాప్తంగా 7.1 కోట్ల మందికి జీవనాధారం

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 11 (విజయక్రాంతి) : భారతదేశంలో మెజార్టీ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ క్రమంలోనే వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పట్టణీకరణ క్రమంగా విస్తరిస్తోంది. మెట్రోపాలిటన్ నగరాల సంఖ్య ఏటా పెరుగుతోంది. అందుకే దేశంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిక సాగిస్తున్న వారి సంఖ్య కూడా అదేవిధంగా పెరుగుతోంది.

వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలలో ఎక్కవ మంది ఉపాధి పొందుతున్నట్లుగా ఇటీవల నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో), రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ, అనరాక్ సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2013 వరకు కేవలం 4 కోట్ల మంది రియల్ రంగంలో ఉపాధి పొందుతుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 7.1 కోట్లకు చేరిందని పేర్కొంది. అలాగే రియల్ రంగంపై ఆధారపడి పరోక్షంగా మరో 2 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి.

దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో రియల్ రంగం వాటా సుమారు 18 శాతం ఉందని ఆ నివేదికలో తెలిపారు. 2014 నుంచి 2023 వరకు మధ్యకాలంలో దేశంలోని ప్రధాన నగరాల్లో 29.32 లక్షల యూనిట్ల ఇళ్ల సరఫరా జరుగగా, 28.27 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయని అందులో తెలిపారు. రెరా, జీఎస్టీ, పీఎంఈవై వంటి పథకాలతో దేశంలో రియల్ ఎస్టేట్ పుంజుకుందని ఈ నివేదికల ద్వారా స్పష్టం అవుతుంది. దీంతో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి.