calender_icon.png 26 October, 2024 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్టర్ల కన్ను

26-10-2024 02:30:41 AM

  1. 600 కోట్లు విలువచేసే 12.9 ఎకరాలు కబ్జాకు యత్నం
  2. సబ్ రిజిస్ట్రార్ సాయంతో రికార్డులు తారుమారు 
  3. ఆరుగురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : నకిలీ పత్రాలతో సుమారు రూ.600 కోట్ల విలువైన 12.09 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో సబ్ రిజిస్టార్ సహా మొత్తం ఆరుగురిని సైబరా బాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సైబరాబాద్ ఈఓడబ్ల్యూ(ఎకనామిక్ అఫెన్స్ వింగ్) డీసీపీ కే ప్రసాద్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఎల్ ఐపీసీవో)కు  రాయదుర్గం ప్రాంతంలో 12.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాని విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ. 600 కోట్ల వరకు ఉంటుంది. ఇటీవల ఈ 12.09 ఎకరాల స్థలంలోని 5.16 ఎకరాలలో తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్‌టీపీసీ)తో కలసి యూనిటీ మాల్‌ను నిర్మించాలని లీజు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ. 202 కోట్లు కేటాయించింది. అయితే ఈ భూమిపై కొందరు కబ్జాదారుల కన్ను పడింది. ఈ స్థలం 1978లో ఫైజులా అనే వ్యక్తి పేరు మీద ఉంది. తర్వాత క్రమంలో అది ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. ఇంకేముంది ఆ ఖరీదైన భూమిని కబ్జా చేసేందుకు అతడి వారసులమంటూ కొందరు తెరపైకి వచ్చారు.

బాలానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జే గురు సాయిరాజ్ సహాయంతో ఆ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి రూ. 600 కోట్ల విలువైన 12.09 ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారు. ఆ స్థలంలో  గీక్ బిల్డర్స్ యజమాని నవీన్ కుమార్ గోయల్‌తో కలిసి 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 30:70 నిష్పత్తిలో 39 అంతస్తుల కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ మెగా కాంప్లెక్స్‌ను నిర్మించేం దుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే నకిలీ పత్రాలను సృష్టించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి మండలం తహసీ ల్దార్ కుక్కల వెంకటరెడ్డి ఈ నెల 10న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి కబ్జాకు యత్నించిన నిందితులు బొరబండ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ రజాక్, మహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయిదా కౌసర్, అఫ్షా సారాలతో పాటు వీరికి సహకరించిన బాలానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జే గురు సాయిరాజ్, గీక్ బిల్డర్స్ యజమాని నవీన్ కుమార్ గోయల్‌లపై పలు సెక్షన్ల కింద కేసులు నమో దు చేసి, శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఈఓడబ్ల్యూ డీసీపీ కే ప్రసాద్ తెలిపారు.