దుబాయ్, జూలై 6: వస్త్ర దుకాణాల ముందు అందమైన డ్రెస్‌లతో అలంకరించిన బొమ్మలను పట్టణాల్లో ఉండేవారంతా చూసే ఉంటారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొత్తకొత్త మోడల్ డ్రెస్‌లను తొడిగి ఆడ, మగ బొమ్మలను షోకేస్‌లలో ప్రదర్శిస్తుంటారు. ఇదంతా రొటీన్ కదా.. కాస్త కొత్తగా ప్రయత్నిద్ధామనుకున్నారో ఏమోగానీ.. దుబాయ్‌లో ఓ షాపింగ్ మాల్ నిర్వాహకులు బొమ్మకు బదులుగా నిజమైన మనిషినే షోకేస్‌లో నిలబెట్టేశారు. బాగా డబ్బున్నవాళ్లకు షాపింగ్ డెస్టినేషన్‌గా మారిన దుబాయ్‌లోని దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్‌లో మాంటో బ్రైడ్ స్టోర్ అనే షాపులో ఆంజెలీనా అనే అందమైన మోడల్‌కు అత్యాధునిక డిజైన్‌తో తయారుచేసిన ఖరీదైన డ్రెస్ వేసి బొమ్మల మధ్య నిలబెట్టారు. ఈ మోడల్ వీడియోను ఆ మోడలే స్వయంగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. దీనిని చూసినవారిలో కొందరు ఇదేదో కొత్త ఐడియాలాగుందే! అని అభిప్రాయపడగా, మరికొందరు మనుషికి కనీస గౌరవం ఇవ్వకుండా బొమ్మలతో సమానంగా చూస్తారా? అని మండిపడుతున్నారు.