calender_icon.png 24 February, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ హైరానా!

24-02-2025 01:01:31 AM

  1. జిల్లాలో ప్లాట్లకు గిరాకీ కరువు 
  2. అమ్ముడుపోని రెడీమేడ్ ఇల్లు
  3. వ్యవసాయ భూముల అమ్మకాలు అంతంతే 
  4. క్రయ విక్రయాలు లేక ఇబ్బంది పడుతున్న వ్యాపారులు 

వికారాబాద్, ఫిబ్రవరి -23:  వికారాబాద్ జిల్లా ఏర్పాటయ్యాక భూముల ధరలు ఆకాశానంటాయి. వికారాబాద్ పట్టణ పరిధిలో ప్లాట్ల ధరలు ఏకంగా హైదరాబాద్ చుట్టుపక్కల ధరలతో పోటీపడ్డాయి. రెండు మూడేళ్ల పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు వెంచర్లు, ఆరు ప్లాట్లు అన్నట్లుగా జోరుగా సాగింది. అయితే కరోనాతో రియల్ దందా ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. 

కొనుగోళ్లు అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయి వ్యాపారం చేతికిల పడిపోయింది. కరోన వ్యాప్తి తగ్గిన తర్వాత అమ్మకాలు కొనుగోళ్లలో కొంత కదలిక వచ్చింది. అయితే అప్పటికే అడ్డగోలుగా పెరిగిపోయి ఉన్న ధరలు భారంగా ఉన్న పరిస్థితుల్లో, ధరలు మరింత పెరగడంతో పాటు ప్లాట్లు కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వ్యాపారంలో స్తబ్దత ఏర్పడింది. 

ముఖ్యంగా వికారాబాద్ పట్టణంతోపాటు జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలైనా తాండూర్, పరిగి, కొడంగల్  పట్టణాల లో  పలు కాలనీల వెంచర్లలో  ప్లాట్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. అమ్మకాలు లేకున్నా ప్లాట్ల ధరలు మాత్రం తగ్గడం లేదు. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు మాత్రమే కొనుగోలు చేస్తుండగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు మాత్రం ప్లాట్లు కొనేందుకు ముందుకు రావడం లేదు. 

వికారాబాద్ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధరలు భారీగా పెరగడంతో పాటు కొనుక్కోవాలనుకున్న సామాన్యులు బిమిలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని పలు కాలనీలో ప్లాట్లు కొనాలంటే గజానికి 20 వేల నుండి 40 వేల వరకు వెచ్చించాల్సి వస్తుంది. సొంత ఇంటి నిర్మాణానికి కనీసం 200 గజాల ప్లాటు కొనాలంటే రూ.  40 నుంచి 80 లక్షల వరకు ఖర్చు చేయాల్సింది.

పెరిగిన ఖర్చులతో కుటుంబాలు నడపడమే కష్టంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు నివాస స్థలం కొనడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. పట్టణానికి దూరంగా వెంచర్లలో కూడా గజానికి తక్కువలో తక్కువ పదివేల పలుకుతుంది. ప్లాట్లు కోసం కనీసం రూ. 10 లక్షలైనా వెచ్చించాల్సిందే.

పట్టణానికి దూరంగా ప్లాట్లు కొంటె దానికి భవిష్యత్తు ఉంటుందో లేదోనని కొనడానికి చాలామంది వెనుకాడుతున్నారు. పట్టణంలో పెరిగిన ధరలతో కొందరు సొంత ఊర్లలోనే  ఇల్లు కట్టుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే గతంలో ఊళ్ళల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేయడంతో భూముల ధరలు భారీగా పెరిగాయి.

తక్కువలో తక్కువ ఎకరానికి రూ. 40 లక్షల దాకా పలికాయి. మారూముల గ్రామాల్లో రూ. 30 లక్షలు పట్టణాలు మండల కేంద్రాలకు సమీపంలో రూ. 50  లక్షల నుంచి ఒక కోటి దాకా పలికాయి. ఇటీవల కాలంలో కొనుగోలు తగ్గిపోవడంతో ధరలు పడిపోయాయని చెప్తున్నారు.

కొనుగోలు చేసిన వారు అమ్ముదామంటే కొనేవారు లేని పరిస్థితి నెలకొంది అంటున్నారు. జిల్లాలో బిల్డర్లు ఇల్లు కట్టి విక్రయిస్తున్నారు. వాటికి గిరాకీ లేకపోవడంతో బిల్డర్లు ఇబ్బంది పడుతున్నారు.