calender_icon.png 27 October, 2024 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ వ్యాపారం కుదేలు

13-07-2024 12:05:00 AM

  • యాద్రాద్రి పరిసర ప్రాంతాల్లోని వెంచర్లు వెలవెల
  • విక్రయాలు లేక తలలు పట్టుకుంటున్న రియల్టర్లు 
  • పదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టిన వారికీ చుక్కెదురు

హైదరాబాద్ చుట్టుపక్కన భూమి కొంటే భవిష్యత్తు ఆ భూమి ధరలకు రెక్కలు వస్తాయని అందరూ భావిస్తారు. భూమి పిల్లల అవసరాలకు పనికొస్తుందని విశ్వసిస్తారు. అలాగే పదేళ్ల క్రితం ఓ ప్రైవేటు ఉద్యోగి గజం రూ.5 వేల చొప్పున యాదాద్రి పరిసర ప్రాంతంలో రూ.10 లక్షల విలువైన భూమి కొన్నాడు. ఇప్పుడు అవసరం వచ్చి భూమిని అమ్ముదామంటే కొనే నాథుడే లేడు. బాధితుడు ఏజెంట్లను సంప్రదించి అమ్మిపెట్టమంటే, వారు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. ఇది ఒక  ప్రైవేటు ఉద్యోగికి ఎదురైన అనుభవం కాదు. ఈ ప్రాంతంలో భూమి కొన్న దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు ఎదురైన చేదు అనుభవం.

 -యాదాద్రి భువనగిరి, జూలై 12 (విజయక్రాంతి)

విశ్వనగరంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుచెందుతుందనే ప్రచారంతో గ్రేట ర్‌తో పాటు చుట్టపక్కన జిల్లాల్లో రియల్  ఎస్టేట్ వ్యాపారం ఉవ్వెత్తున ఎగిసింది. కానీ రెండేళ్ల నుంచి ఆ రంగం కుదేలవుతున్నది. రియల్ ఎస్టేట్ సంస్థలు వేలాది ఎకరాల్లో రూ.కోట్లు పెట్టుబడులు పెట్టి వేసిన వెంచర్లలోని ప్లాట్ల కొనుగోళ్లు నానాటికీ పడిపోతు న్నాయి. ఇప్పటికే కొన్న భూములకు పెద్ద ధరలు లేకపోవడం, వాటిని కొనేవారు లేకపోవడంతో భూమిపై పెట్టుబడులు పెట్టిన వారు సైతం నైరాశ్యానికి గురవుతున్నారు. పిల్లల వివాహాలు, చదువుల సమయానికి భారీగా సొమ్ము చేతికి వస్తుందని ఆశిస్తే నిరాశే ఎదురైందని భంగపడుతున్నారు. రియల్ వ్యాపారంలో దిగి కస్టమర్లకు ప్లాట్లు అమ్ముదామనుకున్న మధ్యవర్తుల ఆశలు అడియాశలయ్యాయి. వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొ న్నాయి.

ఎదిగిన విధానం ఇలా..

తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ గ్రామీణ మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అమాంతం పెరిగింది. ఆయా మండలాల్లో పర్యాటక, పారిశ్రామిక ప్రాజెక్టుల విస్తరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో రియల్టర్లు భారీగా వెంచర్లు వేసేందుకు పోటీ పడ్డారు. యాదాద్రి జిల్లా పరిధిలోని యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునః నిర్మాణం, భువనగిరి, కొలనుపాక, కొమురవెల్లి వంటి ఆలయాల అభివృద్ధి, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పారిశ్రామిక కారిడార్, రంగారెడ్డి నల్లగొండ జిల్లాల సరిహద్దున రాచకొండ గుట్టలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్‌సిటీ ఏర్పాటు వంటి ప్రకటనలతో రియల్టర్లు రాళ్లు, గుట్టలను తొలిచి, పంటలు పండే వ్యవసాయ భూములను కన్వర్ట్ చేసి వెంచర్లు వేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు అరచేతిలో వైకుంఠం చూపి కస్టమర్లను ఆకర్షిం చారు. దీంతో రాత్రికి రాత్రే ఎకరా భూమి రూ.20 లక్షల నుంచి ఏకంగా రూ.కోటి వరకు పెరిగింది. అనతి కాలంలోనే ఆ ఎకరానే రూ.2 కోట్ల నుంచి ఇంకా.. ఇంకా.. పెరిగింది. దిగువ మధ్య తరగతి, మధ్య తరగ తి ప్రజలు అప్పోసప్పో చేసి, పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో ఈ ప్రాంతంలో ప్లాట్లు కొన్నారు. కొందరైతే సంవత్సరాల తరబడి నెలనెలా వాయిదాలు చెల్లించారు. 

పడిపోయిన అమ్మకాలు..

రెండేళ్ల నుంచి రియల్‌ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం కస్టమర్లకు పాట్లు అమ్మలేకపోతున్నాయి. వ్యాపార నిర్వహణ వ్యయం, పెట్టుబడి వడ్డీల భారం మోయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన ఓ సంస్థ నిర్వాహకుడు కార్యాలయాన్ని సైతం నిర్వహించే పరిస్థితి లేదని నిస్సహాయంగా చెప్పడం గమనార్హం. ఇదే పరిస్థి తి కొనసాగితే తమ పెట్టుబడులు తిరిగి రాక, వడ్డీలు చెల్లించలేక దివాలా తీయాల్సిన పరిస్థితి తప్పదని ఇంకొందరు చెప్తున్నారు.

అందుబాటులో లేని ధరలు..

సామాన్యుడికి అందుబాటులో లేని ధరల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు పట్టణాలు, నగరాల్లోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కనీసం చదరపు గజం స్థలం కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. అదే విధంగా దాదాపు గత పుష్కర కాలంగా జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలను ఆనుకొని ఉన్న స్థలా లు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో వెలసిన వెంచర్ల పరిసరాల్లో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. వెంచర్లను విక్రయించినపుడు వేసిన తారు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు స్థంభాల వంటివి కూడా శిథిలావస్థకు చేరాయి.

ఇక అనధికారికంగా చేసిన లే అవుట్లలో అయితే కనీసం ప్లాట్ల హద్దు రాళ్లు కూడా కనిపించని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్లాట్లు నివాసయోగ్య ప్రదేశాలుగా అభివృద్ధి చెంద కపోవడంతో వాటిని రీసేల్ చేయలేని పరిస్థితుల్లో కొనుగోళ్లు చేసేవారు కరువయ్యారు. మొత్తంగా ధరలు పెరగడం, అభివృద్ధిపై అనుమానాలు ఉండడంతో కొనుగోళ్లపై ప్రజల్లో ఆసక్తి కనిపించడం లేదు.