calender_icon.png 12 October, 2024 | 5:52 AM

నత్తనడకన రియల్ వ్యాపారం..!

25-08-2024 12:00:00 AM

మెదక్ జిల్లాలో తగ్గిన రాబడి

ఆందోళనలో రియల్టర్లు 

మెదక్, ఆగస్టు 24 (విజయక్రాంతి): మెతుకు సీమ మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నత్తనడకన సాగుతోంది. భూములపై పెట్టిన పెట్టుబడులు రాక రియల్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందు లతో సతమతం అవుతున్నారు. హైదరాబాద్‌కు సమీపంగా ఉండడం, జాతీయ రహదారి కలిగి ఉన్నందున జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, రామాయంపేట, నర్సాపూర్, మెదక్ ప్రాంతాలలో గతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగింది. వందల సంఖ్యలో వెంచర్లు వెలిశాయి.

ప్లాట్లతో పాటు జిల్లాలోని వ్యవసాయ భూములకు కూడా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల నుంచి బడా వ్యాపారులు, శ్రీమంతులు వచ్చి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మార్కె ట్ బాగుందని ఇక్కడి వ్యాపారులు సైతం భారీగా పెట్టుబడులు పెట్టారు. కరోనా దెబ్బకు నాలుగేండ్ల క్రితం రియల్ వ్యాపారం కుదేలైంది.

ఆ తర్వాత కాస్త పుంజుకున్నా గత ఏడాదిగా మెదక్ జిల్లాలో మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క అడుగు ముం దుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ వ్యాపారం గాడిన పడుతుందని రియల్టర్లు భావించారు. కానీ మెదక్ జిల్లాలో ప్రస్తుతం రియల్ వ్యాపారం పుంజుకోవడం అంత సులువు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. 

 జిల్లాలో తగ్గిన రాబడి..

మెదక్ జిల్లాలో రామాయంపేట, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ సబ్ రిజిష్ర్టేషన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో సంవత్సరానికి సుమారుగా రూ.70-75 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించగా, 2021-22 సంవత్సరంలో 9,167 డాక్యుమెంట్లకు గాను రూ.43.92 కోట్లు ఆదాయం వచ్చింది. 2022-23 సంవత్సరానికి 1,2347 డాక్యుమెంట్లకు గాను రూ.68.58 కోట్లు, 2023- 24 సంవత్సరానికి 1,4735 డాక్యుమెంట్లకు గాను రూ.68.12 కోట్ల ఆదాయం వచ్చింది.

ఈ సంవత్సరంలో డాక్యుమెంట్లు పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. అలాగే 2024 నుంచి ఈనెల 28 వరకు పరిశీలిస్తే 4,983 డాక్యుమెంట్లకు గాను రూ.21.63 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ప్రస్తుతం అమ్మకాలు, కొనుగోళ్లు మందగించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎనమది నెలలు గడిచినా రూ.21.63 కోట్ల ఆదాయం మాత్రమే రావడంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ.40 కోట్ల ఆదాయం కూడా వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

కష్టాల్లో వ్యాపారులు, ఏజెంట్లు...

వ్యాపారంలో క్రయవిక్రయాలు తగ్గుముఖం పట్టడంతో రియల్  వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్లాట్లు, భూముల ధరలు పెరగాల్సినదాని కంటే ఎక్కువే పెరిగాయి. ఇంకా పెరగవచ్చనే అంచనాలతో చాలామంది పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలావుండగా కొనుగోలుదారుడికి, అమ్మకందారులకు మధ్యవర్తిత్వం చేసే ఏజెంట్‌లు మెదక్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నారు. దీనినే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వారంతా క్రయవిక్రయాలు లేక ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మార్కెట్ పడిపోయింది..

రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పడిపోయింది. రెండేళ్ల నుంచి ఈ దుస్థితి నెలకొంది. క్రయ విక్రయాలు అంతగా జరగడం లేదు. భూములపై పెట్టుబడులు పెట్టిన వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

 దశరథ్, 

రియల్ వ్యాపారి, మెదక్ జిల్లా

మెదక్ జిల్లాలో ఇలా...

సబ్ రిజిష్టర్ 2021-22 2022-23 2023-24 2024-21.8.2024

కార్యాలయం డాక్యుమెంట్లు - ఆదాయం డాక్యమెంట్లు - ఆదాయం డాక్యుమెంటు - ఆదాయం డాక్యుమెంట్లు - ఆదాయం

(రూ.కోట్లలో) (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)

మెదక్ 2076 - 6.67 3289 - 8.37 4209 - 9.41 1488 - 3.19

రామాయంపేట 2372 - 6.36 3442 - 10.80 3528 - 9.26 1255 - 2.90

నర్సాపూర్ 697 - 2.53 978 - 4.45 1604 - 3.94 623 - 1.89

తూప్రాన్ 3962 - 28.36 4638 - 44.94 5394 - 45.50 1617 - 13.63

మొత్తం 9107 - 43.92 12347 - 68.58 14735 - 68.12 4983 - 21.63