* ఢిల్లీ సీఎం అతిశీ ప్రకటన
* సీఎం బంగ్లాను మరోసారి రద్దు చేసిన పీడబ్ల్యూడీ
న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన నివాసాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి రద్దు చేసిందని విమర్శించారు మూడు నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని అతిశీ పేర్కొన్నారు. మీడియాతో మంగళవారం ఆమె మాట్లాడుతూ తనకు కేటాయించిన నివాసాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం రద్దు చేసిందన్నారు.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) జారీ చేసిన నోటీసును మీడియాకు చూపించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా చేసిందని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బీజేపీ తన వస్తువులను రోడ్డుపై పడేసిందని దుయ్యబట్టారు.
వాళ్లు తన ఇంటిని లాక్కున్నా.. పనులకు అడ్డుతగిలినప్పటికీ తాను మాత్రం ఢిల్లీ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. ఒకవేళ అవసరమైతే ప్రజల్లో ఇళ్లల్లో ఉంటూనే వారి కోసం పని చేస్తానన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తా పేర్కొన్నారు.
అయితే నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే కేటాయించిన నివాసానికి షిఫ్ట్ కావాల్సి ఉంటుందని.. మూడు నెలలు గడుస్తున్నా సీఎం అతిశీ అధికార బంగ్లాకు షిఫ్ట్ కాలేదనే విషయాన్ని పీడబ్ల్యూడీ అధికారులు చెబుతున్నారు. అందువల్లే ఆమెకు కేటాయించిన నివాసాన్ని రద్దు చేస్తూ నోటీసు పంపినట్టు సమాచారం.