calender_icon.png 13 November, 2024 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ వెంట పాదయాత్రకు రెడీ

10-11-2024 01:11:01 AM

  1. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది
  2. కేసీఆర్ కిట్ల సీఎం అయితే రేవంత్ తిట్ల సీఎం
  3. రేవంత్‌రెడ్డి మాటలకు ఏ-సర్టిఫికెట్ ఇవ్వొచ్చు
  4. మెదక్ జిల్లా కొల్చారంలో నిర్వహించిన రైతు గర్జన సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు

 కౌడిపల్లి, నవంబర్ 9: మూసీ సమస్యలపై పాదయాత్ర చేయడానికి తాను సిద్ధమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మూసీ సమస్యలపై వచ్చే జనవరిలో నల్లగొండ జిల్లా వాడపల్లి నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తానని.. దమ్ముంటే మీరు కూడా నాతో పాటు పాదయాత్ర చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.

శనివారం మెదక్ జిల్లా కొల్చారంలో నిర్వహించిన రైతు గర్జన సభకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని అన్నారు.

రేవంత్‌రెడ్డి మంచోడు అనుకున్నారు కానీ ప్రజాధనాన్ని ముంచేటోడని ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుందన్నారు. హామీ ఇవ్వకున్నా సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలను అమలు చేశారని.. అందుకే ఆయన రైతుల సీఎం అయ్యారని తెలిపారు.

కేసీఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి  డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ది కిట్ల పాలన..రేవంత్‌రెడ్డిది తిట్ల పాలన అని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు కూడా సెన్సార్ పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని, రేవంత్‌రెడ్డి మాట లకు ఏ ఇవ్వాలని విమర్శించారు. 

ఆరు గ్యారెంటీల అమలు అంతంతే.. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నప్పటికీ ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కనిపించిన దేవుళ్లందరిపై ఒట్టు వేసి 50 శాతం మందికి మాత్రమే మాఫీ చేశారని, రైతులకు ఖరీఫ్ రైతుబంధు రానట్టేనని అన్నారు.

రైతులు పండించిన ధాన్యం కల్లాల్లో, రోడ్లపై కనిపిస్తోందని, ఎక్కడా ధాన్యం కొనుగోలు చేసినట్లు కనిపించడం పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో రూ.1.50 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. మూసీ వెంట చేసిన పాదయాత్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకేనని విమర్శించారు.

ప్రభుత్వం ఇకనైనా ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు చిన్నఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.