యుద్ధానికి శాంతియుత
పరిష్కారం కనుగొందాం
ఉక్రెయిన్‌తో యుద్ధంపై
రష్యా అధ్యక్షుడికి
మోదీ ఆఫర్
కజన్‌లో వ్లాదిమిర్
పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు
కజన్ (రష్యా), అక్టోబర్ 22: సుధీర్ఘంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. చర్చల ద్వారా శాంతియుతంగా యుద్ధాన్ని ముగించేందుకు భారత్ తనవంతు సాయం చేస్తుందని తెలిపారు. గతంలోనూ ఇదే విషయాన్ని చెప్పానని గుర్తుచేశారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లిన ప్రధాని.. కజర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రష్యా ఉక్రెయిన్ ఘర్షణపై మీతో (పుతిన్) మొదటి నుంచీ స్థిరంగా టచ్‌లోనే ఉన్నాను. గతంలో నేను చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే అభిప్రాయానికే కట్టుబడి ఉన్నాం. త్వరగా శాంతి, సుస్థిరతలకు సాధించేందుకు సంపూర్ణ మద్దతిస్తాం. సమయం వచ్చినప్పుడు భారత్ సాధ్యమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నది’ అని మోదీ తెలిపారు. పుతిన్‌తో సమావేశం అద్భుతంగా సాగిందని భేటీ అనంతరం ఎక్స్‌లో మోదీ సందేశం ఉంచారు. మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు రష్యాలో కొనసాగిన తన పర్యటనతో భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని వెల్లడించారు.
భారత పథకాలతో మాకు ప్రయోజనం
భారత ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కొనసాగిస్తున్న విధానాలతో రష్యాకు ఎంతో మేలు జరుగుతున్నదని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ‘భారత్ అంతరప్రభుత్వాల కమిషన్ తదుపరి సమావేశం డిసెంబర్ 12న ఢిల్లీలో ఉన్నది. మన పథకాలు స్థిరంగా పురోగమిస్తున్నాయి. కజన్‌లో భారత కాన్సులేట్‌ను ప్రారంభిం చాలన్న మీ (మోదీ) నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. భారత విధానాలు రెండుదేశాల మధ్య సహకారానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మీరు రష్యాకు రావటం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అని మోదీతో పుతిన్ అన్నారు.
మోదీకి ఘన స్వాగతం
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు రష్యాలోని కజన్‌కు చేరుకొన్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి భారతీయులు మోదీకి హార్ధిక స్వాగతం పలికారు. భారత్ చెందిన ఇస్కార్ కార్యకర్తలు హరే కృష్ణ, హరే రామ నినాదాలతో హోరెత్తించారు. కృష్ణ భజనతో మోదీకి స్వాగతం పలికారు. వీరిలో ఎక్కువమంది రష్యా పౌరులే ఉండటం విశేషం.
మరింత బలపడిన బ్రిక్స్
బ్రిక్స్ కూటమి 2006లో ఏర్పడింది. ఇందులో మొదట బ్రెజిల్, ఇండియా, చైనా, రష్యా ఉండేవి. 2010లో దక్షిణాఫ్రికా చేరింది. 2024 జనవరి 1 నాటికి ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ కూడా చేరాయి. సౌదీ రేబియాకు సభ్యత్వం ఇవ్వటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రపంచ జనాభాలో ఈ కూటమిలోని దేశాల్లోనే 40 శాతం ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 28 శాతం వాటాకు ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఇందులో చేరేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచ ముడి చమురు ఉత్పత్తిలో 44 శాతం ఈ కూటమి దేశాల నుంచే వస్తున్నది. దీంతో బ్రిక్స్ కూటమి ధనిక దేశాల ఆర్థిక ఆధిపత్యానికి సవాల్ విసురుతున్నది. బుధ, గురువారాల్లో జరిగే శిఖరాగ్ర సదస్సులో కూటమిని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా సమావేశం కానున్నారు.
మనకు దుబాషీ అవసరం లేదు
ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ మధ్య దైపాక్షిక చర్చల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొన్నది. సమావేశాన్ని ఉద్దేశించి పుతిన్ మాట్లాడుతూ.. ‘మన రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బలమైనవి. అందువల్ల నా మాటలు తర్జుమా (దుబాషీ) అవసరం లేకుండానే మీకు అర్థమవుతాయని అను కొంటున్న’ అని అన్నారు. దీంతో మోదీ ఫక్కున నవ్వారు. కాగా, బ్రిక్స్ సదస్సు జరిగే కజన్‌లో మోదీ దిగగానే అక్కడి అధికారులు స్థానికంగా ఎంతో ఫేమస్ అయిన వంటకాలతో స్వాగతం పలికారు. రష్యా సంప్రదాయ వేషధారణలో ఉన్న మహిళలు పళ్లేల నిండా మిఠాయిలు, ఇతర వంటకాలతో స్వాగతం పలకటం అందరినీ ఆకట్టుకొన్నది.