బ్రిడ్జ్‌టౌన్: టీ20 ప్రపంచకప్ సూపర్ పోరులో అఫ్గానిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా నేడు జరగనున్న మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. పసికూన అనే ట్యాగ్‌ను ఇప్పటికే చెరిపేసుకున్న అఫ్గానిస్థాన్‌ను తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మదిలో పెట్టుకున్న రోహిత్ సేన మ్యాచ్‌కు సిద్ధమైంది. లీగ్ దశలో మూడు విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో గ్రూప్ టాపర్ గా టీమిండియా సూపర్ అడుగుపెట్టింది.
మరోవైపు లీగ్ దశలో సంచలన ప్రదర్శన కొనసాగించిన అఫ్గానిస్థాన్ అదే జోరును ఇక్కడా ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రూప్ దశలో న్యూజీలాండ్ లాంటి పెద్ద జట్టుకు షాక్ ఇచ్చిన అఫ్గానిస్థాన్.. వెస్టిండీస్‌తో మినహా మిగతా అన్ని జట్లపై భారీ విజయాలు సాధించింది. ఐసీసీ టోర్నీలో అఫ్గాన్‌పై టీమిండియాదే పైచేయి అయినప్పటికీ రోజురోజుకు బలంగా తయారవుతున్న ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సిందే. ఈ సందర్భంగా ఇరుజట్ల బలబలాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఆ ముగ్గురే కీలకం
ఇక అఫ్గానిస్థాన్ బ్యాటింగ్‌లో టాపార్డర్ కీలకంగా మారింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా, గుల్బదిన్ నైబ్‌తో కూడిన బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా టీమిండియాకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్‌లో అఫ్గానిస్థాన్ ఎక్కువగా స్పిన్నర్ల మీదే ఆధారపడింది. గ్రూప్ దశలో ఫజల్ ఫరుఖీ, రషీద్ ఖాన్‌ల ద్వయం అగ్రభాగం వికెట్లు నేలకూల్చగా.. ఆల్‌రౌండర్ నబీ, నూర్ అహ్మద్‌లతో పాటు పేసర్ నవీన్ ఉల్ హక్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌లు జరగ్గా టీమిండియా 7సార్లు విజయాలు అందుకోగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది.