ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ, ఆగస్టు 7: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన బ్యాలెన్స్ షీట్‌ను పటిష్టపర్చుకున్నదని, తగిన మూలధన పెట్టుబడులను చేసి తదుపరి దశ వృద్ధికి సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. అనిశ్చిత, ఒడిదుడుకుల ప్రపంచంలో భారత్ స్థిరంగా నిలిచిందని, ఈ నేపథ్యంలో 2035కల్లానెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ సాధిస్తామని రిలయన్స్ తాజా వార్షిక నివేదికలో అంబానీ పేర్కొన్నారు. ఈ ఏడాది రికార్డు సమయం లో దేశవ్యాప్తంగా జియో ట్రు5జీ నెట్‌వర్క్ రోల్‌అవుట్ చేసి డిజిటల్ మౌలిక సదుపాయాల్ని పెంపొందించిందని తెలిపారు. వేగంగా వృద్ధిచెందుతునన ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న వినియోగ అవసరాలకు తగినరీతిలో రిలయన్స్ రిటైల్ విస్తరించిందన్నారు.
నాలుగో ఏటా జీతం నిల్
వరుసగా నాలుగో ఏడాది కూడా ముకేశ్ అంబానీ తన కంపెనీల నుంచి ఎటువంటి జీతం తీసుకోలేదు. తన సంతానం మాత్రం డైరెక్టర్లుగా సిట్టింగ్ ఫీజును, కమిషన్‌ను తీసుకున్నారు. 2008 నుంచి 2019 వరకూ తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్న ముకేశ్ కొవిడ్ పాండమిక్ నేపథ్యంలో 2020 నుంచి జీతం తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2023 వార్షిక నివేదిక ప్రకారం అంబానీ జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు పొందలేదు. అయితే బిజినెస్ ట్రిప్‌లకు ప్రయాణ చార్జీలు, వసతి ఖర్చులను కంపెనీ భరిస్తుంది.
రూ.3,327 కోట్ల డివిడెండు ఆదాయం
109 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ముకేశ్ అంబానీ ప్రస్తుతం ప్రపంచం లో 11వ శ్రీమంతుడిగా ఉన్నారు. అంబానీ, ఆయన కుటుంబానికి రిలయన్స్‌లో 50.33 శాతం వాటా (332.27 కోట్ల షేర్లు) ఉన్నది. 2023 -24 సంవత్సరానికి రిలయన్స్ ఒక్కో షేరుకు రూ.10 చొప్పున డివిడెండు ప్రకటించడంతో ముకేశ్ కుటుంబానికి రూ.3,322 కోట్ల డివిడెండు ఆదాయం లభిస్తుంది.