22-02-2025 01:17:19 AM
* కేసీఆర్ ఇప్పుడు కొట్టుడు కొడతా అంటున్నాడు. లిక్కర్ స్కాం చేసిన నీ బిడ్డను కొట్టు.. డ్రగ్స్ భూతాన్ని తెచ్చిన నీ కొడుకును కొట్టు.. కమీషన్లు కొట్టిన నీ అల్లుడిని కొట్టు.. కొడంగల్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతుంటే అధికారులపై మీరు దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు. మేము చేసిన పాపమేమిటి, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోకూడదా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నారాయణ పేట ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఊడిగం చేసి కృష్ణా జలాలు సీమ కు తరలించుకుపోయేందుకు సహకరించింది బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ కాదా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమకు నీరు అక్రమంగా తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకు న్నది ఎవరని అన్నారు.
కేసీఆర్ చేసిన పాపాలు తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవి నిజం కాదని చెప్పే దమ్ము ఉందా అని ఆయన బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటుంటే.. కాంగ్రెస్ పాలన ఏమి బాగాలేదని, గట్టిగా కొడతానని.. కేసీఆర్ అంటున్నారని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
అభి వృద్ధిపై చర్చకు ఎవరొస్తారో రావాలని ముఖ్యమంత్రి సవాలు విసిరారు. నారాయణపేట అంబేద్కర్ చౌరస్తాలోనే చర్చ పెడదామని అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో దాదాపుగా రూ.1000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పక్‌పల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
మీరు పదేళ్లలో చేసిన అభివృద్ధి.. మేము ఈ పద్నాలుగు నెలల్లో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధ్దమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్లేస్, డెట్ చెప్పాలని బీఆర్‌ఎస్, బీజేపీ అధినేతలకు సవాల్ విసిరారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిన కేసీఆర్ వేలాది కోట్ల రూపాయులు దోచుకున్నాడని ఆరోపించారు.
పన్నెండు సంవత్సరాల మోడీ పాలన, పందేండ్ల కేసీఆర్ పాలనలతో మా పద్నాలుగు నెలల పరిపాలనను పోల్చి చూసేందుకు బహిరంగ చర్చకు రావాలన్నారు. ‘కేసీఆర్ ఇప్పుడు కొట్టుడు కొడతా అంటున్నాడు. లిక్కర్ స్కాం చేసిన నీ బిడ్డను కొట్టు.. డ్రగ్స్ భూతాన్ని తెచ్చిన నీ కొడుకును కొట్టు.. కమీషన్లు కొట్టిన నీ అల్లుడిని కొట్టు’.. అని ముఖ్యమంత్రి అన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే రోజుకు 12 టీఎంసీల కృష్ణా జలాలు తరలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతుందన్నారు. కొడంగల్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతుంటే అధికారులపై మీరు దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.
మేము చేసిన పాపమేమిటి, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుకోకూడదా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ గ్రామంలో ఆయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ గ్రామాల్లోనే పోటీ చేస్తామని, మీరు ఎక్కడ అయితే డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఉన్నాయో అక్కడే పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు.
జూరాల, సంగంబండ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆర్టీఎస్ బీఆర్‌ఎస్ పాలనలో ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన దాదాపు 7 దశబ్దాల తరువాత తిరిగి పాలమూరు బిడ్డగా తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 30 సంవత్సరాలుగా పరిష్కారం చేయలేని ఎస్సీ ఉపకులాల సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందన్నారు. ఇవన్నీ కేసీఆర్ కళ్ళకు ఎందుకు కనిపించలేదని పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని చెప్పి ప్రధాని మోదీ మోసం చేశారన్నారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 2022లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి, ఆ హామీలను మరిచారని సీఎం విమర్శించారు. ఈ సభలో మంత్రులు పొంగులేటి, జూపల్లి, సీతక్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.