calender_icon.png 23 October, 2024 | 11:02 AM

చర్చకు సిద్ధమా?

05-05-2024 12:14:55 AM

యూపీఏ, ఎన్డీఏ ఇచ్చిన కేంద్ర నిధుల లెక్క తీద్దాం

స్థలం మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే

కొడంగల్, అమరవీరుల స్థూపం.. ఎక్కడైనా సిద్ధం 

సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు, నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడద గుడ్డు అంటూ దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. యూపీఏ, ఎన్డీఏ హయాంలో తెలంగాణకు వచ్చిన కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు. 2014 2024 కాలంలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు రూ.9 లక్షల కోట్ల నిధులను ఇచ్చిందని తెలిపారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కింద రూ.2 లక్షల కోట్లు విడుదల చేసిందని చెప్పారు. 2004 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వాటాగా రూ.45 వేల కోట్లకు మించి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చిన నిధులతో పోలిస్తే మోదీ పాలనలో రాష్ట్రానికి 4 రెట్లు నిధులు వచ్చాయని వివరించారు. 

హుందాగా ఉండాలి

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణలో 2,500 కిలోమీటర్ల హైవేలు నిర్మిస్తే.. గత పదేళ్లలోనే 2,500 కిలోమీటర్ల మేర హైవేలు నిర్మించడంతోపాటు మరో 2,500 కిలోమీటర్ల కొత్త హైవేల పనులు పురోగతిలో ఉన్నాయని కిషన్‌రెడ్డి వివరించారు. రామ గుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్ ఏర్పాటు, ఎయిమ్స్, ఉద్యాన వర్సిటీ, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, అనేక రైల్వే ప్రాజెక్టులు తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే గాడిదగుడ్డు అంటూ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందో, బీజేపీ ఏం చేసిందో ప్రజల ముందు అర్థవంతమైన చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కిషన్‌రెడ్డి తెలిపారు.

‘రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అయినా, అమరవీరుల స్థూపం వద్ద అయినా, తెలంగాణ జీవధార అయిన కృష్ణా, గోదావరి నదుల ఒడ్డున అయినా సరే.. స్థలం, సమయం, తేదీ మీరే నిర్ణయించండి. నిర్ధారిత వాస్తవాలతో మీతో అర్థవంతమైన చర్చకు నేను సిద్ధం. చర్చ సందర్భంగా మనం ఉపయోగించే భాష అసభ్యకరంగా కాకుండా హుందాగా ఉండాలని నా షరతు. ప్రజల ముందు వాస్తవాలు ఉంచేందుకు ఈ చర్చలో పాల్గొనేందుకు మీరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.