26-02-2025 01:30:42 AM
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): పట్టుదలతో చదవాలని మీ లక్ష్యాలను చేరుకునేలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని -ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంధాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ షాషాబ్ గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, న్యూ టౌన్ లోని ఉన్నత పాఠశాలలో, బేసిక్ ప్రాక్టీస్ స్కూల్ లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను వారు పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ, మీ భవిష్యత్తు బాగుండాలని ఎమ్మెల్యే వారి సొంత నిధులతో ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా అందిస్తున్నారని, లక్షలు ఖర్చు చేసినా ఇలాంటి అమూల్యమైన మెటీరియల్ మనకు దొరకదని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే ఈ స్టడీ మెటీరియల్స్ అందించారని, అందువలన పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు.
ఈ సారి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ మాట్లాడుతూ మీ భవిష్యత్తు బాగుండాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నారని చెప్పారు.
అందుకే ఎంతో ఖర్చు చేసి మీకు ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ బాలు యాదవ్, నాయకులు పాపారాయుడు, ఖాజా పాషా, గులాం జహీర్, అంజద్, రాషెద్, అంజద్ అలి , హకీం, రాఘవ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.