calender_icon.png 7 November, 2024 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత లక్ష్యంతో చదవండి

07-11-2024 01:58:59 AM

  1. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు 
  2. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
  3. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ  
  4. గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని, విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌లో సచివాలయంలో అడుగుపెట్టి పరిపాలనలోనూ భాగస్వామలు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాలోని వైరా, మధిర నియోజకవర్గాలకు చెందిన గురుకుల విద్యార్థులు బుధవారం సచివాలయంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.


అనంతరం రేవంత్‌రెడ్డి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. అందుకే డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని వెల్లడించారు. 21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు దేశ నిర్మాణంలో భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు.

సామాజిక న్యాయం అందించేందుకే ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు.

చదువుతోపాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలొస్తాయని, అందుకే విద్యార్థులు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. టాటా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని తెలిపారు. 

యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ

ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యంతోపాటు ఉద్యోగ భద్రతను కల్పిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు.

గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. వ్యసనాలకు బాసిసైతే జీవితాలు నాశనమవుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని కోరారు. నవంబర్ 14న 15 వేల మంది విద్యార్థులతో మంచి కార్యక్రమం చేయబోతున్నామని, అదే రోజు ఫేజ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయబోతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.